తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత, భువనగిరి ఎమ్మెల్యే  శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 


ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయం ఇప్పుడు మరోసారి హీట్‌ ఎక్కింది. గురువారం అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ టైంలో సడెన్‌గా జరిగిన ఐటీ రైడ్స్‌ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. 


అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీస్‌లు, వారి బంధువుల, సహచరుల నివాసాలపై కూడా ఐటీ కన్నేసింది. ఈ ఉదయం నుంచి మూకుమ్మడిగా సైలెంట్‌గా అధికారులు అటాక్ చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో తనిఖీలు చేస్తున్నారు. 


ప్రస్తుతం ముగ్గురు ప్రజాపతినిధులపై జరుగుతున్న ఐటీ రైడ్స్‌ తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇంట్లో వేకువజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉంటున్నారు. ఆయన ఇంటితోపాటు ఆఫీసుల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 


పైళ్ల శేఖర్‌ రెడ్డి యాదాద్రి జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నివాసం, కంపెనీల్లో కూడా తనిఖీలు చేపట్టింది ఐటీ శాఖ. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని ఆఫీస్‌, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లతోపాటు మొత్తం 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే నివాసాలు, బంధువుల ఇళ్లు, ఆఫీస్‌లపై సోదాల కోసమే 30 టీంలు పని చేస్తున్నాయి. 


మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు చెందిన షాపింగ్ మాల్‌పై ఐటీ శాఖ గురిపెట్టింది. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో ఐటీశాఖ రైడ్స్ చేసింది. ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.