Telangana News : మునుగోడు ఉప ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు టిక్కెట్ ఆశించి నిరాశకు గురైన బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. మాజీ ఎంపీ  బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్త్ తరుణ్ చుగ్‌, బండి సంజయ్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్న సమయంలో టీఆర్ఎస్ కీలక నేత  బీజేపీలో చేరేందుకు ఢిల్లీ రావడం .. ఆ పార్టీ నేతలను సైతం ఆశ్చర్య పరిచింది. 2014లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ .. టీఆర్ఎస్‌లో ప్రముఖ బీసీ నేతగా ఎదిగారు. 


బూర నర్సయ్య గౌడ్ రాజీనామా లేఖ వివరాలివే.. 
2009 – 2014:
నేను తెలంగాణ ఉద్యమంలో మీ నాయకత్వంలో టి-జాక్ లో భాగంగా 2009 నుండి నా బిజీ ప్రాక్టీస్ ను కూడా లెక్కచేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు శక్తి వంచన లేకుండా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ము రావడం వల్ల అందరి కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం లో మీరు నాకు భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.
2014 – 2019:
భువనగిరి ఎంపీగా గెలిచిన తదుపరి నేను శక్తి వంచన లేకుండా, నియోజక అభివృద్ధికి, ఇటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేశాను. దాని ఫలితమే ఏయిమ్స్ , కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారులు , ఇలా ఎన్నో అభివృద్ధి పనులు. ఇటు ఢిల్లీలో కూడా తెలంగాణ అభివృద్ధికి, నా వంతు పాత్ర పోషించాను. ఎలాంటి అవినీతి, ఆరోపణ లేకుండా పనిచేసాను. తెలంగాణ ప్రగతితో పాటు, తెరాస పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేశాను.


2018 - అసెంబ్లీ ఎన్నికలు:
భువనగిరి పార్లమెంటు ఏరియా ఎంఎల్ఏ ల గెలుపు కొరకు నా శక్తి మేరకు కృషి చేశాను, ప్రచారం చేశాను. కేవలం మళ్ల తెరాస గెలవాలని , మీరు ముఖ్య మంత్రి కావాలని కసితో తిరిగాను. నా పాత్ర చిన్నది అయినా కొంత ఎంఎల్ఏ ల గెలుపు కొరకు తోడ్పడింది. 
2019 - పార్లమెంటు ఎన్నికలు:
మీరు నాకు మళ్ల ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నేను 5 ఏండ్లలో చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయి అని అందరు ఊహించారు, కానీ స్వల్ప మెజారిటీతో , బుల్డోజర్ గుర్తు, అంతర్గత కుట్రల వలన ఓడిపోయాను. అది మీకు తెలుసు. మీరు నాకు మళ్ల పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత భావంతో ఇన్నాళ్లు ఎన్నో అవమానాలు జరిగిన భరించాను.


బూర నర్సయ్య గౌడ్ రాజీనామా లేఖ


మే 25 , 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి, నియోజక వర్గం లో తిరుగుతూ, తెరాస పార్టీలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. కానీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత నేను ఎదురుకున్న అవమానాలు, అవరోధాలను కేవలం మీరు నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం వలన, అలానే మీ కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం వలన హాలాహలంగా భరించాను. పదవులకొరకు, పైరవీలు చేసే వ్యక్తిత్వం కాదని తెలిసి కూడా, మీరు కనీసం కలిసి ప్రజల సమస్యలు విన్నవించుకునే అవకాశం కూడా కల్పించలేదు. బడుగు బలహీన వర్గాలు సమస్యలను నేను పదే , పదే ప్రస్తావించడం, దానిపై మీరు నా పై అసహనం వ్యక్తం చేయడం ఒక ఉద్యమ కారుడిగా ఎంతో బాధించింది. నేను ఎప్పుడు ప్రజల సమస్యలు తప్ప, వ్యక్తిగత ప్రయాజనాల కొరకు మీ వద్ద పైరవీలు చేయలేదు. కానీ నాకు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నా అవసరం పార్టీకి లేదని తెలిసిందని రాజీనామా లేఖలో బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.