మునుగోడు రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు రోలర్‌ గుర్తు మార్పు విషయంలో ఆర్వో నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ గుర్తును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకోవాలని సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్వో వివరణపై సాయంత్రం నివేదిక పంపాలని ఆదేశించింది. అదే సమయంలో మునుగోడు అభ్యర్థుల గుర్తుల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


ఈసీ ఆదేశాల మేరకు ఫారం 7(ఎ) సవరణ చేస్తూ అభ్యర్థి శివ కుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తు కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మారిన గుర్తులతో బ్యాలెట్‌ ముద్రణకు ఈసీ చర్యలు తీసుకోనుంది.


నామినేషన్ దాఖలు చేసిన యుగతులసి అనే పార్టీకి చెందిన శివ కుమార్ తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారని, ఆ తర్వాత దాన్ని మార్చేసి బేబీ వాకర్ గుర్తు ఇచ్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన కాపీని కూడా జత చేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానయ్య కూడా గుర్తుల కేటాయింపులో గందరగోళం నెలకొందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తులు మార్చడంపై రిటర్నింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది.


ఈ గుర్తుల కేటాయింపుపై ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి వివరణ కూడా కోరారు. అయితే, గుర్తులు మార్చాలని తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, బ్యాలెట్ పేపర్లు ప్రచురణకు పంపామని, ఈసీ ఏవైనా మార్పులు సూచిస్తే మారుస్తామని చెప్పారు. 


రిటర్నింగ్ అధికారిపై వేటు


మునుగోడు రిటర్నింగ్‌ అధికారి (RO) పై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. రోడ్డు రోలర్‌ గుర్తు మార్చారని ఫిర్యాదు రాగానే ఈసీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ముందు కేటాయించిన గుర్తులు ఎందుకు మార్చారని ఆర్వో నుంచి వివరణ తీసుకొని ఇవాళ సాయంత్రంలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాకుండా, ఆ ఆర్వోపై చర్యలకు ఉపక్రమించింది. ఆర్వోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను అధికారులు ఎన్నికల సంఘానికి పంపారు. సాయంత్రంలోగా కొత్త రిటర్నింగ్‌ అధికారి నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.


నవంబర్ 3న పోలింగ్


మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈనెల 3వ తేదీన విడుదల చేశారు. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించారు. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6వ తేదీన కౌంటింగ్ ఉండనుంది. మునుగోడుతోపాటు దేశంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇదే తేదీల్లో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.