వరుసగా మూడు పరీక్షలు జరిగాయి. కానీ అన్ని పరీక్షలపై అనుమానాలే.. అయినా ఈ దపా జరిగిన పరీక్షల్లో పారదర్శకత చూపిస్తారంటూ అటు నిరుద్యోగులు, ఇటు సింగరేణి వర్గాలు భావించినప్పటికీ మళ్లీ పాత పాటే అన్నట్లుగా ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవల నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 çపరీక్షల సందర్భంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ తాము అంతా సక్రమంగానే చేశామని సింగరేణి అధికారులు, అటు జేఎన్‌టీయూ అధికారులు చెబుతునప్పటికీ పరీక్ష జరిగే రోజునే కొంత మంది అభ్యర్ధులను గోవాకు తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడే పేపర్‌ లీకైందని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిన సింగరేణి యాజమాన్యం, జేఎన్‌టీయూ అధికారులు హడావుడిగా పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.


ఫలితాలలో తప్పులు దొర్లడంతో పాటు ఇప్పుడు ఈ పరీక్షల నిర్వహణ తీరుతో అభ్యర్ధులకు అనేక అనుమానాలు వచ్చాయి. ప్రతీది క్షుణ్ణంగా పరిశీలన చేశామని చెప్పిన అధికారులు ఫలితాలు విడుదల విషయంలో తప్పులు దొర్లడంపై ఇప్పుడు అభ్యర్ధులను గందరగోళానికి గురిచేసింది. కేవలం 177 పోస్టులకు లక్ష మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 70 వేల మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షా పలితాల విడుదలలో తప్పులు దొర్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
పారదర్శత ఏమైంది..?
పరీక్షల పలితాలలో సింగరేణి అధికారులు పారదర్శకత పాటించలేదని అభ్యర్ధులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నాయి. 70 వేల మంది పరీక్షలు రాయగా అందులో కేవలం 49 వేల మంది పరీక్షలలో అర్హత సాదించారని, వారి మార్కులతోపాటు ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తమకు మార్కులు ఎన్నివచ్చాయో..? అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. అందరి మార్కులు వివరాలు వెల్లడించిన తర్వాత ర్యాంకులు విడుదల చేయాల్సి ఉనప్పటికీ కేవలం అర్హత పేరుతో 49 వేల మంది పలితాలు విడుదల చేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తాను ఎన్ని మార్కులు సాధించాననే విషయం తెలియక ఇప్పుడు గందరగోళంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. 
ముచ్చటగా మూడోసారి ఇదే తంతు..?
2015లో సింగరేణి సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ పరీక్షల ఫ లితాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షా పేపర్‌ ముందుగానే లీకైందనే విషయంతోపాటు కేవలం దొడ్డిదారిన వెళ్లిన వారికే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఆ తర్వాత నిర్వహించిన జేఎంఈ (జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌) పరీక్షల నిర్వహణ సందర్భంగా ఏకంగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ అభ్యర్ధులు దొరకడం, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ పట్టుబడ్డారు. కాగా ఈ విషయంలో విచారణ సందర్భంగా 2015లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించిన వారు ఉండటం, విచారణ మధ్యలోనే నిలిపివేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మరోవైపు ఈ మూడు పరీక్షలు నిర్వహణలోనూ ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి.


పరీక్షలకు కేవలం 15 రోజుల ముందు సింగరేణిలో కీలకమైన డైరెక్టర్‌ ‘పా’ పదవి చంద్రశేఖర్‌కు ఇవ్వడం, కేవలం ఐదు నెలల ముందుగా రిటైర్డ్‌ అయ్యే వ్యక్తికి ఇప్పుడు ఆ పదవి కట్టుబెట్టడంతో సింగరేణిలో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జేఎంఈ పరీక్షల నిర్వహణ సందర్భంగా జరిగిన అనుమానాలపై అభ్యర్ధులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం, అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ పరీక్షల సమయంలో పదవిని ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటీ ప్రతి విషయంలో పారద్శకంగా ఉంటామని చెప్పే సింగరేణి యాజమాన్యం ఇప్పుడు పరీక్షల నిర్వహణలో వస్తున్న ఆరోపణలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.