Devi Navaratri Row in Nalgonda | డిండి: తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో పోటీ పడి మీర దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుంటారు. కానీ నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ వివాదం చోటుచేసుకుంది. గ్రామంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు ముదిరి వివాదానికి దారితీశాయి. విగ్రహ ప్రతిష్ఠాపన స్థలం విషయంలో ఇరువర్గాలు పట్టుబట్టడంతో మాటమాట పెరిగి చివరికి ఆధిపత్య పోరుకు వెళ్లింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడం, ఏ వర్గం వారు తగ్గకపోవడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముందే దుర్గామాత విగ్రహాన్ని కనీసం పూజలు కూడా నిర్వహించకుండానే నిమజ్జనం చేశారు. అప్పటికీ కొందరు వద్దురా.. ఇది దేవుడు, దేవతలకు సంబంధించిన కార్యక్రమం. విగ్రహాన్ని పూజలకు ముందే నిమజ్జనం చేయడం అరిష్టమని చెబుతున్నా వినిపించుకోకుండా చెరువలో నిమజ్జనం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. విగ్రమం నిమజ్జనం ఫలితంగా తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరగాల్సిన నవరాత్రి ఉత్సవాలు నిలిచిపోయాయి. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని భావించిన గ్రామస్థులు, భక్తులు ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పవిత్రమైన పండుగ వేళ రాజకీయ విభేదాలతో నవరాత్రి ఉత్సవాలను భగ్నం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని కనీసం పూజలకు కూడా నోచుకోనివ్వకుండానే సాగనంపడం పట్ల అరిష్టం జరుగుతుందేమో అంటూ గ్రామంలో చర్చ మొదలైంది. గ్రామ ప్రశాంతతను దెబ్బతీస్తూ ఉత్సవాల నిర్వహణలో గొడవలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
