Khammam Politics  :   సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశమవుతోంది.  టీఆర్ఎస్‌తో పొత్తులోకి వెళ్లిన వెంటనే .. పోటీ పడి మరీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఆయన పోలీసులపైనే తన  ఫైర్ చూపించడం.. టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశమవుతోంది. పైగా తమకు అంతో ఇంతో  బలమున్న ఖమ్మం జిల్లాలో ఇప్పుడు టీార్ఎస్ నేతల కన్నా ఎక్కువగా పోలీసులపై పట్టు కోసం ఆయన ఇలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. 


దూకుడైన కమ్యూనిస్టు నేత కూనంనేని !


సమస్యల గురించి ప్రశ్నించాల్సి వచ్చినా తనదైన శైలిలో విరుచుకుపడతాడు కూనంనేని. ఇదే తరుచూ వివాదాలకు కారణంగా మారుతుంది.  సీపీఐ మండల నాయకుడిని ఖమ్మం రూరల్‌ సీఐ బెదిరింపులకు పాల్పడ్డాడని తెలియడంతో  ఆ సీఐపై కూనంనేని విరుచుకుపడ్డారు.   కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం ప్రాంతంలో పార్టీ కోసం మూడు దశాబ్ధాలుగా పనిచేసిన కూనంనేని కార్మికుల సమస్యల కోసం, ఇటు ప్రజాసమస్యలకు నిత్యం సీపీఐ పార్టీ తరుపున పనిచేస్తూ ఉంటారు. అయితే ఆందోళన చేయడం కొత్తేమి కాదు. గా బహిరంగ వేదికలలో అధికారులను సవాల్‌ చేయడం, ప్రధానంగా పోలీస్‌లపైనే ఆయన వ్యాఖ్యానాలు చేస్తూంటారు. 


ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ అధఇకారులపై విరుచుకుపడేవారు !  


2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కూనంనేని తన కన్నెర్రతో రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. పాల్వంచ సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన  మహిళా ఐఏఎస్‌ ఓ సమస్య విషయంలో దురుసుగా ప్రవర్తించడంతో అదికాస్తా వివాదంగా మారింది. ఈ విషయంలో ఆ ఐఏఎస్‌ అధికారిణి కన్నీరు పెట్టుకోవడంతో ఏకంగా ఈ సమస్య కాస్తా ఐఏఎస్‌ల సంఘం దగ్గరకు వెళ్లడం.. కూనంనేని క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టడంతో కాస్తా పట్టుసడలిన కూనంనేని క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్పీపై కూనంనేని బహిరంగ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఎస్పీనే ‘ఖాకీ బట్టలు వదిలేసి రా.. ఖద్దరు  తొడుక్కొ అంటూ’ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వివాదం అటు పోలీస్‌ అధికారులకు, ఇటు సీపీఐ నాయకత్వానికి మద్య కాస్తా ముదిరినట్లే అనిపించింది. ఓ వైపు ఎన్నికల హడావుడి ఉండటం, మరోవైపు పోలీసులు పని ఒత్తిడి ఉండటంతో ఈ వివాదం కాస్తా సద్దుమణిగినట్లు కనిపించింది. 


కూనంనేని తన కోపాన్ని వదిలేస్తాడా..?


ఒకప్పుడు సింగరేణి కార్మికులతోపాటు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్యమాలు చేసిన కూనంనేని  దూకుడుగా ఉంటారు.  అయితే ప్రస్తుతం ఆయన సీపీఐ రాష్ట్ర పార్టీకి బాస్‌గా మారారు. అందుకే కూనంనేని తన శైలిని మార్చుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ తొలి సారే సీఐపై విరుచుకుపడటంతో  మిగిలిన నాయకత్వం, కార్యకర్తలు కూడా అదే శైలిని అనుసరించవచ్చని కిందస్థాయి కార్యకర్తలు పేర్కొంటున్నారు.అయితే ఇలాంటి దూకుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉండాలని కొంత మంది కార్యకర్తలు గుసగులాడుకుంటున్నారు.