komatireddy Rajagopal Reddy | సంస్థాన్ నారాయణపురం: "రీజనల్ రింగ్ రోడ్ (Hyderabad RRR)లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ (ఉత్తర భాగం) రైతులు తలుపు తట్టని అధికారులు లేరు. ఢిల్లీలో పెద్దల్ని కలిసినా బాధితులకు న్యాయం జరగలేదు. వాళ్లకు కావాల్సిన విధంగా జరగాలంటే ప్రభుత్వం మారాలేమో" అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో దివీస్ సంస్థ కోసం రూట్ అలైన్‌మెంట్ మార్చారు. ఇప్పుడు దక్షిణ భాగం మారాలంటే మొదటగా ఉత్తర భాగం అలైన్‌మెంట్ మారాలి. RRR ఉత్తర భాగం అలైన్‌మెంట్ మారాలంటే రాష్ట్ర ప్రభుత్వమే మారాలేమో అని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
భూనిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం భూనిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భూములు కోల్పోనున్న రైతులతో మాట్లాడారు. "నాకు జరిగిన అన్యాయాన్ని నేను తట్టుకున్నాను. కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం సైలెంట్‌గా ఉండలేను. అవసరమైతే ట్రిపుల్ ఆర్ (RRR) రద్దయినా సరే, ఉత్తర భాగం భూనిర్వాసితుల హక్కులను కాపాడుతా" అని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.
ప్రజల కోసం ఏ త్యాగానికైనా రెడీ
"మన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించి, స్తంబింపజేయాలి. మునుగోడు ప్రజలే నాకు బలం, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా, అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా ప్రజలు, రైతులు కూడా నాతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా, ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటానికి మాత్రం వెనుకాడను. పదవుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లే మనిషిని కాను. నాకు నా ప్రాంత ప్రజలే ముఖ్యమని సీఎంకు చెబుతానని" ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
మునుగోడు ప్రజలకే ఎక్కువ నష్టం
"నాపై ఉంచిన మీ నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. రైతుకు, భూమికి మధ్య ఉన్న బంధం విడదీయలేనిది. భూమి అంటే కేవలం వ్యవసాయం కాదు. అది మనకు దక్కే గౌరవం, ఒక స్టేటస్. ట్రిపుల్ ఆర్ లో భాగంగా చేస్తున్న పనులలో ఎక్కువ భూములు కోల్పోతున్నది మునుగోడు నియోజకవర్గ ప్రజలే. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే కేంద్ర మంత్రులను కూడా కలుసుకుని మన సమస్యలు వారికి వివరిస్తాను. మీకు న్యాయం జరిగేవరకు బాధ్యతగల ఎమ్మెల్యేగా మీతో కలిసి పోరాడతా" అని వారికి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో నారాయణపురం మండలానికి చెందిన భూములు కోల్పోయిన రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇదివరకే మంత్రి పదవి విషయంపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంలో సెగలు రేపుతున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ విషయాన్ని లేవనెత్తారు.