Congress and BRS clash over drought : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందంటూ మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన మంత్రులు అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంట పొలాల్లోకి వెళ్లిన కేసీఆర్‌ రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఢిల్లీ పర్యటనలతో కాలం గడుపుతున్నారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా రైతుల కన్నీళ్లను తుడిచేందుకు, పంట పొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన కరువుగా కేసీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. 


బీఆర్‌ఎస్‌ చెప్పేవన్నీ అబద్ధాలన్న మంత్రి ఉత్తమ్‌


తెలంగాణలో విద్యుత్‌ కోతలు, కరువుపై బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదన్న ఉత్తమ్‌.. కేసీఆర్‌కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ కుటటుంబ సభ్యులు తప్ప బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ కనుమరుగు అవుతుందన్నారు. విద్యుత్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనన్నారు. జనరేటర్‌ పెట్టుకుని మీటింగ్‌ పెట్టి.. టెక్నికల్‌ ప్రాబ్లం వస్తే కరెంట్‌ పోతే.. దానికి కరెంట్‌ పోయిందని కేసీఆర్‌ అబద్ధం చెప్పారన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ అవుట్‌ డేటెడ్‌ టెక్నాలజీ అని, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ వల్ల ప్రజలకే భారమని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్తామని కేసీఆర్‌ ఒప్పుకున్నారన్నారు. కేసీఆర్‌ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 


రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అన్న అద్దంకి


కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. గడిచిన పదేళ్లలో బయటకు రాని కేసీఆర్‌కు ఇప్పుడే రైతులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. గతంలో రైతులు పడుతున్న ఇబ్బందులను కనీసం పట్టించుకోని కేసీఆర్‌.. ఇప్పుడు పొలం బాట పేరుతో హడావిడి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండడాన్ని సహించలేక కేసీఆర్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో పంటలు నష్టపోయిన రైతులకు ఎంత మొత్తాన్ని చెల్లించారో చెప్పాలని అద్దంకి డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా కరువు పేరుతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి.