KTR Comments: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డిని 420గా అభివర్ణించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారన్నారు. రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రూ. 2500 లు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి..  420 హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.  అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే వాళ్లకు జలక్ ఇచ్చినట్లయితది. ఒక హెచ్చరిక అవుతుందన్నారు.  


గద్దె దించుతాం
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే గద్దె దించుతామన్నారు. ఆరు నెలల క్రితమే   కాంగ్రెస్ వస్తే మోసం పోతం. గోస పడతాం అని చెప్పామన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపటంతో ప్రజలు మోసపోయారని కేటీఆర్ తెలిపారు.  ఎన్నికల సమయంలో ఎన్నెన్ని హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండని ప్రజలకు సూచించారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో...ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకోవాలన్నారు. పాలిచ్చే బర్రెను కాదని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లు అయ్యింది పరిస్థితి... కేసీఆర్  లక్ష రుణమాఫీ చేసిన వారికి కూడా రూ. 2 లక్షలు డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అన్నాడంటూ గుర్తు చేశారు. చాలా మంది ఆయన మాటలు నమ్మి కొత్తగా లోన్లు కూడా తెచ్చుకున్నారు. మరి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అయినా ఇంత వరకు రుణమాఫీ జరుగలేదని కేటీఆర్ అన్నారు.


రైతులను మోసగించిన కాంగ్రెస్
 రైతుభరోసా పేరుతో రూ. 15 వేలు ఇస్తాం..  కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందిస్తామన్నాని రైతులకు ఆశలు రేపారని కోప్పడ్డారు. వీటన్నింటికీ మించి రైతులకు రూ. 500 బోనస్ ఇస్తా అన్నాడు. దీంతో రైతులు కాంగ్రెస్ కు ఓటేశారు.  ఎన్నికలప్పుడు 21 వందల 83 ఎంఎస్పీ కి రూ. 500 బోనస్ అన్నారు. 21 వందల 83 ఎంఎస్పీ  దొడ్డు బియ్యానికే ఉంది కదా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి ఇప్పుడు మాత్రం సన్న వడ్లు పండిచే వాళ్లకే ఇస్తామని కేబినెట్ సమావేశం పెట్టి చెబుతున్నారు.  ఇది మోసం కాదా? బోనస్ బోగస్ చేశారు. రైతుబంధు, కౌలు రైతులకు సాయం ఇలా అన్ని కాంగ్రెస్ పార్టీ రైతులను మోసగించే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.  


రుణమాఫీ ఊసే లేదు
ఇలాంటి మోసకారి ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేద్దామా?.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ బీఆర్ఎస్ గెలిస్తే వాళ్లు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ గల్లా పట్టి అడిగే పరిస్థితి ఉంటుందన్నారు.  ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం చేస్తే మోసపోయిన వాళ్లదే తప్పు.  దేవుని మీద ఒట్టు వేసి రేవంత్ రెడ్డి రుణమాఫీ అంటున్నాడు. కానీ రుణమాఫీ అవుతుందా? లేదా? మీరే చూస్తారు. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతుబంధు వేసేవారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఓట్లు వేసే నాడు రైతుబంధు గుర్తొస్తోంది.  ఏమైందయ్యా హామీలంటే కేసీఆర్ అన్ని తీసుకుపోయారంటారు. అసలు వాళ్లు ప్రభుత్వంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? వాళ్లకే తెలియటం లేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 


గ్యారంటీలకు గ్యారెంటీ లేదు
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ..  ‘సీఎం లంకె బిందెలు అంటాడు. ఎవరన్నా సీఎం లంకెబిందెల కోసం వచ్చినా అంటాడా?.. ఎవడన్నా సీఎం నా రాష్టం దివాళా తీసింది...అప్పులపాలైందని అంటారా? ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరైనా రాష్ట్రాన్ని తిట్టుకుంటాడా? అట్లయితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా?.. ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకుంటే...ఎగిరెగిరి తన్నే పరిస్థితి వచ్చింది.  ఎన్నికలకు ముందు మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఎవరికైనా వస్తున్నాయా? మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాత్రం మహాలక్ష్మి ప్రొగ్రాం తెలంగాణలో స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు. ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలైనయ్ అని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెబుతున్నాడు.  ఒక్క ఫ్రీ బస్ తప్ప ఇంకో గ్యారంటీయే అమలు చేయలే. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు, 407 హామీలు ఉన్నాయి.  తులం బంగారం, స్కూటీలు అన్నారు. వచ్చినయా స్కూటీలు, బంగారం.  తులం బంగారం కాదు...తులం ఇనుము కూడా ఇవ్వడు.  ఎన్నికల తర్వాత ఏ హమీని అమలు చేయడు.  లక్షా 50 వేల తులాల బంగారం రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. మహిళలలే ఈ సీఎంకి బుద్ధి చెప్తారు.  రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నోటిఫికేషన్ రాలేదు. గాడిద గుడ్డు తప్ప ఇంకేమీ రాలేదు.  కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి మేజిషియన్ ను ఎక్కడ చూడలె. ’ అన్నారు


పదేళ్లలో మూడు మెడికల్ కాలేజీలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లో  ఒక్క నోటిఫికేషన్ లేదు, రాత పరీక్ష లేదు అయిన సరే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఇలాంటి అబద్దపు మాటలను కాంగ్రెస్ అభ్యర్థి  ప్రశ్నిస్తాడా ?  కేసీఆర్ అధికారంలో  ఉన్నప్పుడు అటు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టింది. నల్గొండలో ఫ్లోరోసిస్ తో బొక్కలు విరిగి చనిపోతే పరిస్థితి ఉంటే... మీ కోసమే కదా కేసీఆర్ మిషన్ భగరీథ తెచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.  కేసీఆర్ వచ్చిన తర్వాతనే కదా ప్లోరోసిస్ సమస్య తీరింది. ప్లోరోసిస్ ను చరిత్ర పుటలోకి పంపించిన ఘనత కేసీఆర్ కదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 60 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. కానీ కేసీఆ  పదేళ్లలోనే మూడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్  యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానాన్ని వెయ్యేళ్లు నిలిచిపోయేలా నిర్మించారు.  నల్గొండ ను దేశంలోనే అత్యధికంగా పంట పండించే జిల్లాగా చేసింది కేసీఆర్ అంటూ  గుర్తు చేశారు.


ప్రజలకు ఈస్ట్ మన్ కలర్ సినిమా 
యాద్రాద్రి లో పవర్ ప్లాంట్ ద్వారా 16 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసేలా చేశాం. మునుగోడు, దేవరకొండలో తాగునీటి కష్టాలు తీర్చింది కూడా కేసీఆర్ గారే.  నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా.. ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చినప్పటికీ మనం చెప్పుకోలేకపోయాం. ఎన్నో పనులు చేసినప్పటికీ తప్పుడు ప్రచారం కారణంగా స్వల్ప తేడాతో ఓడిపోయాం.  ఒక వైపు పదేళ్ల నిజమైన పాలన. మరొవైపు 150 రోజుల అబద్దపు, మోసం పాలన. కాంగ్రెస్ పార్టీ చూపించిన ఈస్ట్ మన్ కలర్ సినిమా కారణంగా ప్రజలు వాళ్లను నమ్మారు,  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తే ప్రజలు ఆయనకు మొదటి హెచ్చరిక జారీ చేసినట్లు అవుతుంది. అప్పుడే ఆయన చెప్పిన అన్ని హామీలను అమలు చేసే పరిస్థితి ఉంటదన్నారు కేటీఆర్.


ఆయనపై 56క్రిమినల్ కేసులు
ఎంతో కష్టపడి బిట్స్ పిలానీలో సీటు తెచ్చుకొని గోల్డ్ మెడల్ సాధించిన  బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరాడు.  మరి కాంగ్రెస్ వాళ్ల అభ్యర్థి ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి మేధోమదనం చేసి ఆ అభ్యర్థిని ఎన్నుకున్నారన్నారు. ఆయన మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 74 రోజులు చంచల్ గూడ జైల్లో ఉన్న అనుభవం ఉందన్నారు. ఆయనేమీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లలేదు. లంగ పనులు చేసి జైలుకు పోయిండు. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసినందుకు కొన్ని కేసులు, బెదిరించి ఒక కుటుంబాన్ని వేధించినందుకు మరో కేసు ఆయన పై ఉన్నాయన్నారు. ఇటు వైపు గోల్డ్ మెడలిస్ట్. అటు పచ్చి బ్లాక్ మెయిలర్.  శాసన మండలిలో సామాన్యూడైన రాకేష్ రెడ్డి ఉండాల్నా, రేవంత్ రెడ్డి అండతో బ్లాక్ మెయిల్ చేసి కోట్లు సంపాదించిన వ్యక్తి ఉండాల్నా? ఓటర్లే ఆలోచించాలన్నారు కేటీఆర్.