నేను ముఖ్యమంత్రి అయితా అని ఒక‌రు.. నేను బుడ్డెర‌ఖాన్ అయితా అని ఇంకోక‌డు.. కాంగ్రెస్ పార్టీలో ఆరాటపడేవాళ్లు ఎక్కువ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో డ‌జ‌న్ మంది ముఖ్యమంత్రులు అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ న‌న్ను గెలిపిచండి నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని అన్నారు. అస‌లు కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 


కాంగ్రెస్ నేతలు ర‌కరకాల మాయ‌మాట‌లు చెప్పి గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పార్టీల త‌ర‌పున నిల‌బ‌డే వ్యక్తుల‌నే కాదు.. ఆ పార్టీ తీరు తెన్నుల గురించి కూడా తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచి నీళ్ల కోసం అనేక క‌ష్టాలు ప‌డ్డామని చెప్పారు. ఇవాళ అన్ని స‌మ‌స్యల‌ను అధిగ‌మించుకున్నామని అన్నారు. 


దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని కేసీఆర్ అన్నారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు అని చెప్పారు. రాజకీయ నాయకులు కళ్ల ముందు జరిగిన దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారని.. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని అన్నారు. గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకుని.. వారి హ‌క్కుల‌ను కాపాడామని అన్నారు. హుజుర్‌ న‌గ‌ర్‌కు వారం ప‌ది రోజుల పాటు మ‌ళ్లీ సాగు నీళ్లు వదులుతామని కేసీఆర్ చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.


1956లో తెలంగాణను ఏపీలో కలపాలని ప్రతిపాదన వచ్చినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇడ్లీ, సాంబారు గో బ్యాక్‌ ఉద్యమ సమయంలో కాల్పులు జరిగాయని అన్నారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కనీసం నోరు మెదపలేదని అన్నారు. వాళ్లు ఏనాడూ ప్రజల కోసం కొట్లాడలేదని చెప్పారు. వారికి పదవులు ఉంటే చాలని.. ప్రజలు ఏమై పోయినా పట్టించుకోరని విమర్శించారు. అసెంబ్లీలో కూడా గందరగోళం సృష్టించారని అన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఏనాడూ నీళ్ల కోసం పోరాడలేదని అన్నారు.