KCR Speech in Nagarjunasagar: తెలంగాణలో రాబోయే ఎన్నికల గురించి ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలని, ఏది నిజమో, ఏది రాయి, ఏది రత్నమో ప్రజలు తెలుసుకొని మరీ ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంగళవారం (నవంబర్ 14) సీఎం పాల్గొన్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Constituency) బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు (Nomula Bhagath) ఓటు వేయాలని కేసీఆర్ ప్రజల్ని కోరారు. ఆయన 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు మంచి చేస్తారు.. ఎవరు నాశనం చేస్తారో ఆలోచన చేసి ఓటు వేయాలని అన్నారు. ఏ ఆలోచన లేకుండా ఆగమాగం ఓట్లు వేయొద్దని చెప్పారు.


ఈ సందర్భంగా కేసీఆర్ (KCR Speech) మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఉన్న రోజుల్లో రూ.200 పింఛను పెద్దోళ్ల ముఖాన కొట్టి, మీ చావు మిమ్మల్ని చావమన్నదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఆ పింఛనును రూ.వెయ్యి చేసి, ప్రస్తుతం రెండు వేలు ఇచ్చుకుంటున్నామని అన్నారు. మళ్లీ ఆ పింఛనును రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. నోముల భగత్‌ను గెలిపిస్తే అందరి పింఛన్లు రూ.5 వేలకు పెరుగుతాయని చెప్పారు. 


కంటి వెలుగు ఎక్కడైనా చూశారా?
కంటి వెలుగు కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడైనా నిర్వహించారా? అని కేసీఆర్ అడిగారు. 3 కోట్ల మందికి కళ్ల పరీక్షలు చేసి అవసరమైన 8 లక్షల మందికి కళ్ల అద్దాలు ఇచ్చామని గుర్తు చేశారు. అమ్మ ఒడి వాహనం వచ్చి తీసుకెళ్లి ప్రసవం చేయించి.. ఇంటికాడ దిగబెడుతున్నదని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, పిల్లాడు పుడితే రూ.12 వేలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తుందని కేసీఆర్‌ గుర్తు చేశారు.


రైతు బంధు, 24 విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతుబంధు దుబారా అని, 24 గంటల విద్యుత్‌ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే చెబుతున్నారని.. వారి గోల్‌మాల్ మాటలు విని ఆగం కావొద్దని ప్రజలను కేసీఆర్ కోరారు. ఎన్నికలు పూర్తి కాగానే మార్చి నుంచి రేషన్‌ కార్డు దారులందరికీ సన్నబియ్యమే ఇస్తామని ప్రకటించారు. 


జానారెడ్డి కలలు
అందరూ చెప్పే మాటలు విని ఆగం అయితే ఐదేళ్లపాటు కష్టాల పాలే అవుతామని కేసీఆర్ చెప్పారు. అందుకే ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి వేయాలని, అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లేలా చేయాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం మళ్లీ నిలబెట్టాలని కోరారు. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారని.. గతంలో జనారెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి ఓడగొట్టారని గుర్తు చేశారు. అదే తరహాలో నాగార్జున సాగర్‌లో నోముల భగత్‌ను 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు.