Telangana News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ఉన్న వారికి ముప్పు తప్పినట్లుగా తెలిసింది. ఈ 8 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని అంటున్నారు.
బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలిరోజైన నేడు మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర వచ్చే నెల పదో తేదీన సిద్దిపేట బహిరంగ సభతో ముగుస్తుంది.
కేసీఆర్ బస్సును ఆపిన రైతులు
నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుండగా.. ఆయన బస్సును ఆపి నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు తమ గోడు వినిపించారు. ఐకేపీ సెంటర్ నుంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 20 రోజుల నుంచి కల్లాల్లో వడ్లు పోసుకొని కూర్చున్నామని ధాన్యం ఎవరూ కొనడం లేదని ఆవేదన చెందారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.
“మీరున్నప్పుడు ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దుంకేవి.. మీరు ఉన్నప్పుడే మంచిగుండే సార్.. మల్లా మీ పాలనే రావాల” అని నినాదాలు చేశారు. రైతు బంధు లేదు.. 500 బోనస్ అన్నరు అది బోగస్ అయింది.. మేం పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరు. ఇగ బోనస్ ఏమిస్తారు సార్. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యింది” అని రైతన్నలు గోడు వెళ్లబోసుకున్నారు.
“పోరాడి సాధించుకుందాం నీళ్లు, కరెంటు మళ్లా తెచ్చుకుందాం పోరాటానికి సిద్ధంగా ఉండండి” అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. అంతకుముందు అన్నెపర్తి దగ్గర కూడా కేసీఆర్ ను ఆపి ఇదే తరహాలో రైతన్నలు తమ గోడు వెల్లబోసుకున్నారు.