Telangana Graduate MLC Elections : వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గోల్డ్ మెడలిస్ట్, బిట్స్ పిలానీ స్టూడెంట్ రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారని, మరో వైపు కాంగ్రెస్ నుంచి బ్లాక్ మెయిలర్, 56 కేసులు ఉన్న వ్యక్తి పోటీ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరిని ఎన్నుకోవాలన్నది ప్రజల నిర్ణయమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో సోమవారం నిర్వహించిన పార్టీ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
రైతు బిడ్డ రాకేష్‌రెడ్డి ఎంతో కష్టపడి చదువుకుని అమెరికాలో ఏడేళ్లపాటు ఉద్యోగం చేశాడని, ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం వచ్చాడన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ పార్టీలో చేరి ప్రజల ముందుకు వచ్చిన రాకేష్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిపై అనేక కేసులు ఉన్నాయని, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ వంటి దిక్కుమాలిన కేసులేనన్నారు. పార్టీతోపాటు అభ్యర్థిని కూడా చూడానలి కేటీఆర్ సూచించారు.
స్వల్ప తేడాతో 15కుపైగా సీట్లలో ఓటమి
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో 14 నుంచి 15 సీట్లను ఓడిపోయామని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిందని, అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఉద్యమంలో మనతోపాటు ఉన్న అనేక వర్గాలు దురదృష్టవశాత్తు దూరమయ్యాయని, దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా పదేళ్లలో కేసీఆర్ రెండు లక్షలు ఉద్యోగాలు కల్పించారన్నారు. ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయా..? అని మోదీ, రాహుల్ గాంధీలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
విపరీతమైన అబద్ధాలను యూట్యూబ్‌ల్లో ప్రచారం చేస్తే కొంత మంది నిరుద్యోగులు ఆ వాదనకు ఆకర్షితులయ్యారన్న కేటీఆర్.. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధం కాదన్న ఉద్ధేశంతోనే అనేక పరిశ్రమలను తెప్పించి 24 లోల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు వెల్లడించారు. చేసిన వాటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించి కేటీఆర్.. ఇల్లందు పట్టణంలోనూ 60 ఏళ్లలో కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు చేయని అనేక పనులను పదేళ్లలో కేసీఆర్ చేశారన్నారు. మహబూబాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారని, కొత్తగూడెం, ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పదేళ్లలో రాష్ట్రంలో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్న కేటీఆర్.. మరో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఇలా అన్ని రంగాల్లో పదేళ్లపాటు అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు.
పదేళ్లలో అగ్రస్థానానికి
వ్యవసాయ ఉత్పత్తుల్లో పదేళ్ల క్రితం దేశంలో 14 వ స్థానంలో ఉంటే.. పదేళ్ల కేసీఆర్ పాలనలో అగ్రస్థానానికి రాష్ట్రం చేరుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతులకు రైతు బంధు ఇచ్చారని, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లు వేసినప్పుడు మాత్రమే ఇస్తున్నాడన్నారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తానని రేవంత్ చెప్పారని, ఆరు నెలలు గడిచినా రుణమాఫీ చేయలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రభుత్వాన్నినిలదీయాలంటే రాకేష్‌రెడ్డికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు మాత్రమేనని, అధికార స్వరాలు కాదన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే 420 హామీలు అమలు చేయకపోయినా ప్రజలు నమ్ముతున్నారన్న ధీమా వారిలో ఉంటుందన్నారు.
రైతు భరోసా రూ.15 వేల చేస్తానని చెప్పారని, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన హామీలను అమలు చేశారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడన్న కేటీఆర్.. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు ఉంటే.. ఒక్క హామీని మాత్రమే అమలు చేసి.. అన్నీ అమలు చేశామని సీఎం చెబుతున్నాడన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పే సీఎంకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కసారి మోసపోతే చేసిన వారిది తప్పు అని, రెండోసారి కూడా మోసపోతే మోయిపోయిన వారిదే తప్పు అవుతుందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోయినా 30 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు చెబుతున్నారని, దీనిపై ప్రశ్నిస్తే బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటూ రాకేష్‌రెడ్డి శాసనమండలికి వెళ్లాలన్నారు.
రాకేష్‌రెడ్డి ఆగర్భ శ్రీమంతుడు కాదని, రైతు బిడ్డ అని అన్నారు. రాత పరీక్షలన్నింటినీ ఉచితంగా నిర్వహిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. నాలుగు వేలు ఫీజు వసూలు చేస్తున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. మొదటి కేబినెట్ భేటీలోనే డీఎస్సీ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. సింగరేణిని మోదీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రైవేటు పరం చేస్తారని, ఇప్పటికే దానికోసం అదానీకి తలుపులు బార్ల తెరిచారన్నారు. బడే భాయ్.. చోటా భాయ్ ఒక్కటయ్యారన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని, కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే బీఆర్‌ఎస్ గెలవాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 27న జరిగే పోలింగ్‌లో రాకేష్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.