Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నటించేవాడు కాదు జీవించేవాడు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నేడు (అక్టోబరు 30) జరిగే బహిరంగ సభ సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి అని బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఈ బహిరంగ సభ వేదికపై సీఎం కేసీఆర్ ఏడవబోతున్నారని.. అలా చేయడం ద్వారా సానుభూతిని (సింపథీ) పొందాలని చూస్తున్నాడని అన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంప్ ఆఫీసులో బండి సంజయ్ ఆదివారం (అక్టోబరు 30) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డ్రామాలకైనా తెరతీస్తుందని బండి సంజయ్ విమర్శించారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు సీఎం కాన్వాయ్‌లోనే డబ్బు తరలిస్తున్నారని ఆరోపించారు. గత 8 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల వివరాలను కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
‘‘నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అభివృద్ధిపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏం ఏం అమలు చేశారో చెప్పాలి. మీ టీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ ప్రచారానికి తీసుకెళ్లాలంటేనే అవమానంగా ఎందుకు భావిస్తున్నారో చెప్పాలి’’ అని బండి సంజయ్ అన్నారు.
మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్ రెడ్డి చేసిన సవాలుపై సీఎం కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ దుకాణం నేటి సభతో మూతపడుతుందని, అందుకే కేసీఆర్ బయపడుతున్నారని అన్నారు. బహిరంగ సభను చూసి జనాలు నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారని అన్నారు.
సీబీఐ అంశంపైనా..
సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని కేసీఆర్ అన్నారు. తప్పు చేయకపోతే అంత భయం ఎందుకని అన్నారు. తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీబీఐ విషయంలో ఆగస్టు 30న జీవో - 51 ఇచ్చారని చెబుతున్నారని, బీజేపీ పిటిషన్ వేసే వరకూ జీవో అంశం బయటికి రాలేదని అన్నారు. లిక్కర్ కేసు బయటికి రాగానే జీవో 51 ఇచ్చారంటూ బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కు ఏ సంస్థపైనా నమ్మకం లేదని అన్నారు.
ఎమ్మెల్యేల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశాం. విచారణ జరపకపోతే ఎలా నిజాలు బయటకు వస్తాయి. నలుగురు ఎమ్మెల్యేలను బయటకు రాకుండా ఎందుకు బంధిస్తున్నావు? ప్రగతి భవన్ లోనే ఉంచుకున్నావు. ఈ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడట. పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీలోకి ఎన్ని డబ్బులు ఇచ్చి చేర్చుకున్నావో మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పారా? ఇప్పటి వరకు 33 మందిని ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మాకేం లాభం. ప్రజలు నీ డ్రామాలను పట్టించుకోవట్లేదు. ఇదంతా డ్రామా కాదని ఈ రోజు సభలో మీరు ప్రమాణం చేయండి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.