Bandi Sanjay Comments: రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైసెన్స్ డ్ గూండాల్లా మారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతూ నాటి రజాకార్ల పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలు, ఇసుక, డ్రగ్స్ మాఫియాలకు టీఆర్ఎస్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ధ్వజమెత్తారు. తాము ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని వాడుకోవాలనుకుంటే రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని.. అంతా జైలుకుపోయే వారని వ్యాఖ్యానించారు. ఈడీ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ బడుల్లో చాక్ పీసులకు కూడా పైసలిచ్చే పరిస్థితి లేదని, పంద్రాగస్టు వేడుకల్లో పిల్లలకు చాక్లెట్లు పంచడానికి కూడా డబ్బులివ్వట్లేదని అన్నారు. మోత్కూర్ లోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద ఈ రోజు ఉదయం స్థానిక మీడియాతో బండి సంజయ్ ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..


‘‘బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని వాడుకోవాలని చూస్తే... తెలంగాణలో ఏ ఒక్క మంత్రి,  ఎమ్మెల్యే కూడా మిగలడు. అందరూ జైలుకు పోయే వారు. కేసీఆర్ పై ఈడీ విచారణ ఎందుకు మీరే (మీడియా) అడుగుతున్నారు. ఒకవేళ విచారణ చేస్తే.. బీజేపీ ఈడీని ఉసిగొల్పుతోందని ప్రచారం చేస్తారు. మా పార్టీ ఈడీ విషయంలో జోక్యం చేసుకోబోదు. చట్టం తనపని తాను చేసుకుపోతోంది.
   
•  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చాలాసార్లు చర్చలు జరిపాను. కానీ మా మధ్య రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేనెప్పుడూ అనలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా మంచి పొలిటికల్ లీడర్. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్, టీఆరెస్ పార్టీలు ఉప ఎన్నికకు ముందే పారిపోయాయి.


• కమ్యూనిస్టులు అమ్ముడుపోయే పార్టీలు. ఈసారి ఎటువైపు పోతారో చూడాలి. అయినా కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎటువైపు పోతారో వారికే తెలియదు. కమ్యూనిస్టు పార్టీల్లో కార్యకర్తలు మంచోళ్లు.. లీడర్లు అమ్ముడుపోయేటోళ్లు. 


• కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీ కి సపోర్ట్ చేసింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించాడు. 


• కేసీఆర్ బొమ్మ పెట్టుకొని తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయి. టీఆరెస్ ఎమ్మెల్యే లు, మంత్రులు లైసెన్సుడ్ గుండాలు అయిపోయారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్ళీ వచ్చిందా అనిపిస్తోంది. 


• బీజేపీ "ప్రజా సంగ్రామ యాత్ర"కు భయపడే పెన్షన్ లు, చేనేత బీమా, ఇతర పథకాలు ప్రకటిస్తున్నారు. చేనేత బీమా ప్రకటించకపోతే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతామని మేం హెచ్చరిస్తే భయపడి చేనేత బీమా ప్రకటించారు.


•  హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ టీఆరెస్ పార్టీనే. టీఆరెస్ లో మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ జీవితం ప్రశ్నార్ధకరంగా మారింది. 


• చివరకు లాయర్లను కూడా హత్యలు చేస్తున్నారు. గత 15 రోజుల వ్యవధిలో ఇద్దరు లాయర్లను హత్య చేశారు. అంతకుముందు మంథనిలో హైకోర్టు లాయర్ వామనరావును దారుణంగా హత్య చేశారు. తక్షణమే అడ్వోకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.


• రాష్ట్రంలో కొందరు అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ కు తొత్తులుగా మారారు. బీజేపీ కార్యకర్తలను, లీడర్లను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి అధికారుల జాబితాను రెడీ చేస్తున్నాం. బీజేపీ అధికారం లోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తాం.


• తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉంది.  చాక్ పీసులు కొనే పరిస్థితి లేదు. పంద్రాగస్టు వేడుకల్లో పిల్లలకు చాక్లెట్లు పంచేందుకు కూడా పైసల్లేవు. ఉద్యోగస్తుల మీద కక్షపూరితంగా సీఎం వ్యవహరిస్తున్నాడు.’’ అని బండి సంజయ్ విమర్శలు చేశారు.