Bandi Sanjay On Minister KTR: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్రంగా స్పందించారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. ఈ విషయంపై కేటీఆర్ (KTR) మాట్లాడిన వీడియో క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి రోజున బండి సంజయ్ (Bandi Sanjay) చౌటుప్పల్ లోని చినకొండూరు రోడ్డు వద్ద ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుగోడు సహా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.


అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరుతుండగా మీడియా ప్రతినిధులు ఎదురై చేనేతపై కేటీఆర్ ప్రధానికి లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ చేనేతపై జీఎస్టీ విధించాలంటూ కేటీఆర్ చేసిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు.


‘‘ఇదిగో వీడియో... ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతావ్? జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు? అక్కడ ఏం చెప్పినవ్.. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రాన్ని కోరింది నువ్వే కదా. మరి రద్దు చేయాలని చెప్పకుండా ఏం పీకినవ్?’’ అని దుయ్యబట్టారు. చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆ హామీని నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


‘‘గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు మునుగోడు ప్రజలకు అనేక హామీలిచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు? చాలా హామీలను నెరవేర్చనే లేదు. మరి వాటిని ఎందుకు నెరవేర్చలేదో మునుగోడు ప్రజలకు సమాధానం చెప్పకుండా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుండటం సిగ్గు చేటు.  దొంగ సంతకాలు క్రియేట్ చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపుతున్నారు. పైగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే విధంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పారని, మునుగోడు ప్రజలు సైతం ఆ పార్టీని బండకేసి బాదాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆపదలో ఆదుకునే రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఝప్తి చేశారు. 


టీఆర్ఎస్ (TRS News) గెలిస్తే అహంకారం తలకి ఎక్కుతుంది - బండి సంజయ్


‘‘ఇవి మునుగోడు ఉప ఎన్నికలు (Munugode By Elections) మాత్రమే కాదు.. తెలంగాణ భవిష్యత్తుకు ముడిపడి ఉన్న ఎన్నికలు ఇవి. పొరపాటున టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ లో అహంకారం తలకెక్కుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోయినా, ఉద్యోగాలివ్వకపోయినా, దళిత బంధు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వకపోయినా ఓట్లు వేశారనే భావనతో ఫాంహౌజ్ కే పరిమితమయ్యే ప్రమాదం. కాబట్టి మునుగోడు ప్రజలు అన్నీ ఆలోచించి ఓటేయాలి’’ అని బండి సంజయ్ హెచ్చరించారు.