నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్న గూడెం వాసి అంశాల స్వామి మృతి చెందారు. చిన్నతనంలోనే ఫ్లోరైడ్‌ బారిన పడిన ఆయన... ఆ బాధ నుంచి విముక్తి కోసం చాలా పోరాటాలు చేశారు. రాత్రి టూవీలర్‌పై వస్తున్న అంశాల స్వామి కింద పడిపోయారు. తలకు తీవ్రగాయం కావడంతో మృతి చెందారు. 

గత ముప్పై ఏళ్లుగా నల్గొండ జిల్లా లో మునుగోడు లో ఫ్లోరైడ్ మహమ్మారి పై రాజీలేని పోరాటం చేశారు అంశాల స్వామి. జలసాధన సమితిలో దుస్సర్ల సత్యనారాయణతో కలిసి పార్లమెంటు వరకు ఫ్లోరైడ్‌ సమస్యను తీసుకెళ్లారు. ప్రధానులను కలిసిన తమ గోడు వెల్లబోసుకున్నారు. గోస తీర్చాలని వేడుకున్నారు  అంశాల స్వామి.

అంశాల స్వామి మృతిపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్‌ మహమ్మారిపై పోరాటం చేయడం ఆయన చూపిన తెగువను మర్చిపోలేమన్నారు. ఆయన ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు. ఈ మధ్యే మనుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల సందర్భంగా అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్‌ వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో ఆయనకు మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లుతోపాటు ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయించారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు.

మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా వెళ్లారు. అంశాల స్వామితోపాటు ఆయన తల్లిదండ్రుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇంట్లోనే భోజనం చేశారు. ఇంటి నిర్మాణం, ఆయన హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ అంశాల స్వామి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇంతలోనే అంశాల స్వామి మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది