Rythu Bandhu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో రైతు బంధు కూడా ఒకటి. రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరంలో రెండు పంటలకు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు మేలు చేసే ఈ పథకంపై విమర్శలు చాలానే ఉన్నాయి. రైతు బంధు ద్వారా నిజమైన రైతులు లబ్ధి పొందలేకపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, రైతుబంధు పైసలు అందుకునే చాలా మందికి అసలు వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియదని ప్రతిపక్షాలతోపాటు నిపుణులు విమర్శలు చేస్తున్నారు. రైతు బంధు పథక లబ్ధిదారులకు ఒక పరిమితి ఉంచాలని వారు చెబుతున్నారు. ఇదే విషయంలో ఓ వ్యవసాయ విస్తరణ అధికారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. 


రైతుబంధుకు 5 ఎకరాల పరిమితి విధించండి


రైతు బంధు పథకం కింద 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేసేలా పరిమితి పెట్టాలని నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి- ఏఈవోగా విధులు నిర్వర్తిస్తున్న కల్లేపల్లి పరుశురాములు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. మిగిలిన నిధులను పొలాలను వెళ్లే కాలిబాటలను నిర్మించడానికి ఉపయోగించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను మంగళవారం తపాలా ద్వారా ప్రగతి భవన్ అడ్రస్ కు పంపించారు. 


ఆ సాయం కౌలు రైతులకు అందేలా చూడండి


ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు, వ్యవసాయ రంగ నిపుణులు పరిమితి పెట్టాలన్న సూచనను ఓ వ్యవసాయ విస్తరణ అధికారి కూడా చేయడంతో అది కాస్త ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతు బంధు ఇవ్వకుండా ఆ డబ్బులను కౌలు రైతులకు అందేలా నూతన పథకం తీసుకురావాలని వారు కోరుతున్నారు. 


ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ రూ.7,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రతి ఏడాది, ఖరీఫ్ సీజన్ తరహాలోనే మొదట ఒక ఎకరం రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఆపై అధిక ఎకరాలు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయాన్ని అందిస్తోంది. ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు.  మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (Agri Culture Extension Officer) సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది. 


ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. తొలిసారిగా ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు. అప్పటినుంచి రాష్ట్రంలో రైతు బంధు కొనసాగుతుండగా.. డిసెంబర్‌ నుంచి రైతులకు 10వ విడత నగదు సాయం ప్రారంభించారు.