Komatireddy Venkatreddy : తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికపై పార్టీలు వ్యూహరచనలో ఉన్నాయి. పార్టీ కేడర్ తో వరస భేటీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. 'మన మునుగోడు-మన కాంగ్రెస్' నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనిపించడంలేదు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పీసీసీ తీరుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక సమావేశాలు, కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చిన్న పిల్లాడితో తిట్టించారు
మునుగోడు ఉపఎన్నిక గురించి తనతో ఎవరూ మాట్లాడట్లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చండూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఓ చిన్న పిల్లాడితో తనను తిట్టించారన్నారు. తమని అవమానించిన వారు క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్‌ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రేపటి కాంగ్రెస్ పాదయాత్రకు తనకు ఆహ్వానం లేదన్నారు. తనను అవమానించిన తర్వాత కూడా ఎలా వెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
పాల్వాయి స్రవంతితో భేటీ
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ అభ్యర్థిపై త్వరగా తేల్చే పనిలో నిమగ్నమైంది. ఆశావహులతో కాంగ్రెస్ పెద్దలు భేటీ అవుతున్నారు. పాల్వాయి స్రవంతితో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావీద్‌లు గాంధీభవన్ లో భేటీ అయ్యారు. ఉపఎన్నికకు సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. రెండ్రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సమావేశాలు నిర్వహించారు. ఉపఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించారు. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా కాకుండా అభ్యర్థిని ముందుగా తేల్చాలనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో అభ్యర్థిపై కసరత్తు వేగవంతం చేశారు.
మన మునుగోడు-మన కాంగ్రెస్
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ పార్టీలకు సెమీఫైనల్‌గా మారింది. అన్ని పార్టీలకూ ఈ ఎన్నిక కీలకమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. కాంగ్రెస్ కంచుకోట. బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం. ఇక్కడ గెలవకపోతే .. వచ్చే ఫైనల్స్‌లో పోటీలో ఉందని చెప్పుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ గ్రౌండ్ లెవల్ నుంచి వ్యూహరచన చేస్తోంది. " మన మునుగోడు - మన కాంగ్రెస్" నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మునుగోడులో ప్రచారం చేయాలని షెడ్యూల్ రూపొందిచుకుంటున్నారు.
రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మునుగోడుకు క్యూ కట్టారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెంపుపైనే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రధానంగా బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ గా చేస్తూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. కులాలు, వృత్తుల వారీగా అనుబంధ సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే చండూరులో ఓ సభను కాంగ్రెస్ నిర్వహించింది. 21వ తేదీన బీజేపీ చేరికల సభను నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ కూడా మరో సభ నిర్వహిస్తోంది. ఈ రెండు సభల కంటే ధీటుగా ఆ తర్వాత మరో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Also Read : Munugodu Congress : మన మునుగోడు - మన కాంగ్రెస్ ! ఉపఎన్నికల్లో అమల్లోకి రేవంత్ ప్లాన్
Also Read : "అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్