Case on Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కి చెందిన ఓ ఆడియో టేపు ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే పార్టీకి చెందిన చెరుకు సుధాకర్ కుమారుడితో ఫోన్లో మాట్లాడుతూ.. తన అనుచరులు నీ తండ్రిని చంపేస్తానని అన్న మాటలు సంచలనం రేపాయి. అయితే, ఈ వ్యవహారంలోనే తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. నల్గొండ వన్ టౌన్‌లో సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 506 (నేరపూరిత బెదిరింపులు)తో పాటు వివిధ సెక్షన్ల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఆడియో కాల్ రికార్డింగ్‌లో ఏముందంటే
తన అనుచరులు చెరుకు సుధాకర్ ను చంపడానికి సిద్ధమయ్యారని కోమటిరెడ్డి, చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) కొడుకు సుహాస్‌తో ఫోన్లో మాట్లాడుతూ అన్నారు. చెరుకు సుధాకర్ ను చంపేందుకు తన అనుచరులు వంద కార్లలో తిరుగుతున్నారని, వారం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమంటూ సుధాకర్ కొడుకు సుహాస్‌కు ఫోన్ చేసి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఈ ఫోన్ కాల్ లో కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నట్లు ఉంది.
‘‘సుధాకర్‌ను చంపేందుకు వంద వాహనాల్లో నా అనుచరులు తిరుగుతున్నారు. నిన్ను కూడా చంపుతారు. నీ హాస్పిటల్ కూడా ఉండదు. నేను లక్షల మందిని సాయం చేశాను. వారందరినీ నేను కంట్రోల్ చేయలేను కదా. సుధాకర్ జైల్లో పడితే నేను ఒక్కడినేపోయాను. ఎవరూ పట్టించుకోకపోతే నేనే వెళ్లాను. నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పకపోతే చంపేయడం ఖాయం’’ అని ఓ ఆడియో వైరల్ అవుతుంది. ఇందులో వాయిస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలిఉందని నెటిజన్లు అంటున్నారు.
కోమటిరెడ్డి క్లారిటీ
ఆ సంచలన ఆడియో వైరల్ అవుతున్న వేళ దానిపై నిన్న కోమటిరెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలను కొంత మంది అలా వక్రీకరించారని చెప్పారు. తన మాటలను కట్ చేసి, మార్ఫింగ్ చేశారని చెప్పారు.
తాను తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ ఏమీ అనలేదని చెప్పారు. శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం తనది అని అన్నారు. గతంలో ఓ సారి చెరుకు సుధాకర్‌పై పోలీసులు పీడీ యాక్ట్ పెడితే తానే కొట్లాడానని గుర్తు చేసుకున్నారు. తనపై విమర్శలు వద్దనే సుధాకర్ కుమారుడికి చెప్పానని అన్నారు. తన మాటలను కట్ చేసి, కొన్ని అంశాలు మాత్రమే కలిపి గుర్తు తెలియని వారు లీక్ చేశారని చెప్పారు. ఫోన్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిప్పటి నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతూనే ఉన్నాడని అన్నారు. నన్ను తిట్టొదు అని మాత్రమే సుహాస్‌కు చెప్పానని అన్నారు. తనను సస్పెండ్ చేయాలని పదే పదే అనడం, తిట్టడం వల్లే బాధతో అలా మాట్లాడానని చెప్పారు.