Breaking News Telugu Live Updates: టీఆర్ఎస్‌లోకి దాసోజు శ్రవణ్‌- బీజేపీకి భారీ షాక్‌

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 21 Oct 2022 12:27 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి - కాగ్‌కు షర్మిల ఫిర్యాదు

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాగ్ (CAG) గిరీష్ చంద్ర ముర్ముకు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి వెళ్లిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కేంద్రం పెద్దలను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు.

టీఆర్ఎస్‌లోకి దాసోజు శ్రవణ్‌- బీజేపీకి భారీ షాక్‌

ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన దాసోజ్‌ శ్రవణ్‌ మరోసారి పార్టీ మారుతున్నారు. బీజేపీకి రాజీనామా చేసి తాజాగా కారు ఎక్కనున్నారు. కేటీఆర్ సమక్షంలో సాయంత్రం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 

Visakha Accident: బరోడా మహిళా క్రికెట్ జట్టుకు బస్సు ప్రమాదం

బరోడా మహిళా క్రికెట్ జట్టుకు బస్సు ప్రమాదం
విశాఖలోని తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. బరోడా మహిళల సీనియర్ టీమ్ టీ20 మ్యాచ్ లు ముగించుకుని, ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా, బస్సుకు ముందు ఉన్న లారీ బ్రేకులు వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం

కడప శివారులోని స్పిరిట్ కళాశాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కడపకు చెందిన నలుగురు యువకులు రెండు వేర్వేరు బైకుల్లో వెళ్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. 

దగ్గుబాటి సురేష్ బాబు భూ వివాదం.. పోలీసుల అదుపులో కాంట్రాక్టర్ రామకృష్ణారెడ్డి

దగ్గుబాటి సురేష్ బాబు భూమి వద్ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ గన్తో హల్చల్ చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దగ్గుబాటి సురేష్ బాబుకు రామకృష్ణారెడ్డికి మధ్య కొన్నాళ్లుగా భూవివాదం నడుస్తోంది. సంజీవ రెడ్డి ఆ భూమిలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. తన భూమిలోకి జరిగి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అనడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డికి సంజీవరెడ్డికి వాగ్వాదం జరిగింది.తన గన్ తీసి రామకృష్ణారెడ్డిని సంజీవరెడ్డి బెదిరించాడు. దీంతో రామకృష్ణారెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Background

ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో గురువారం అల్పపీడం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి అక్టోబర్ 22న వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ మరుసటిరోజు మరింత తీవ్రరూపం దాల్చి అక్టోబర్ 24న వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదేరోజు ఒడిశా తీరాన్ని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. 


అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ఏర్పడటంతో మరో మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశాయి అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు. ఏపీకి సిత్రాంగ్ తుపాను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిత్రాంగ్ తుఫానుకి ఎటువంటి సంబంధం ఉండదని, అయితే తుపాను కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు మాత్రం ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. 
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి ఉండొచ్చని తాజా వెదర్ బులెటిన్ లో తెలిపారు. వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తను నుంచి భారీ వర్షం కురవనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ఏర్పడటంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ వర్షాలున్నాయి. అక్టోబర్ 23 వరకు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయి. దాంతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.  రాయలసీమ జల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వర్షాలు పడతాయి. కడప జిల్లాలోని పలు భాగాలు, అనంతపురం జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు చోట్ల (ముఖ్యంగా మదనపల్లి ప్రాంతం) వర్షాలు పడతాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.