KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరొసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నెక్ట్స్ సీఎం తానేనంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లిన కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. పరిమితికి మించి సౌండ్ సిస్టమ్స్ వినియోగించారని అధికారులు ప్రశ్నించారు. దీంతో అధికారులపై కేఏ పాల్ మండిపట్టారు. తెలంగాణకు తానే కాబోయే సీఎం అంటూ హెచ్చరించారు.  


అసలేం జరిగింది?


చండూరులో ప్రజాశాంతి పార్టీకి చెందిన రెండు ప్రచార వాహనాలు ముందు వెళుతుండగా, వాటి వెనుక కేఏ పాల్ వాహనం వెళ్తుంది. అయితే కేఏ పాల్ వాహనాన్ని అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్ నన్నే ఆపుతారా ఎవరిచ్చారు మీకు అధికారం? అంటూ  ఫైర్ అయ్యారు. నేను తెలంగాణకు కాబోయే సీఎంను రెస్పెక్ట్ ఇవ్వండని తీవ్ర స్వరంతో అన్నారు.  ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అని, తాను అనుమతి తీసుకునే ప్రచారం చేస్తున్నానన్నారు. తనను ఆపిన అధికారిని నీ పేరేంటని పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనున్న పోలీసులు కల్పించుకుని కేఏ పాల్ సర్దిచెప్పారు. అధికారి పేరు చెప్పకపోయేసరికి మెడలోని ఐడీ కార్డు పట్టుకుని అందులోని పేరును చూసే ప్రయత్నం చేశారు కేఏ పాల్.  ఇతర అధికారులు జోక్యం చేసుకుని కేఏ పాల్ కు సర్దిచెప్పడంతో వివాదం అంతటితో ముగిసింది.  


అమరవీరుల కుటుంబాలతో కేఏ పాల్ భేటీ 


ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ శనివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో పర్యటించారు. రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి వచ్చిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులతో కలిశారు. చండూరులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. కేఏ పాల్ మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఒక్క అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరగలేదని కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు వచ్చాయన్నారు.  ఉద్యమకారులకు మాత్రం ఏమీ రాలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి నాగరాజు నల్గొండ జిల్లా హుజూర్నగర్ మండలం రాయిని గూడెం గ్రామవాసి పెడమర్తి నాగరాజు 2011 ఆగస్టు 15వ తేదీన రైలు రోకో సందర్భంగా తెలంగాణ కోసం ఆత్మహత్య ప్రయత్నం చేసి రెండు కాళ్లు ఒక చేయి పోగొట్టుకొన్నారన్నారు. నేడు అతడి బతుకు భారమై జీవిస్తున్నారని తెలిపారు.  అలాంటి ఉద్యమకారుల బతుకులు ఆగం కావడానికి అమరుల కుటుంబాలు రోడ్డు మీద పడటానికి కేసీఆర్ కుటుంబం కారణమని కేఏ పాల్ విమర్శించారు.


బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ధిచెబుతాం  


తెలంగాణ అమరుల కుటుంబంలో రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘురామారెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడమే తప్ప వారు చేసిందేంలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే మునుగోడు గడ్డపై ఉండి టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పిన తర్వాతే తమ గ్రామాలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు వరంగల్ రవి, మహబూబాద్ స్వప్న, బెజ్జంకి రమ, గద్వాల జ్యోతి ఇతర జిల్లాల అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.