Minister Harish Rao : బీఆర్ఎస్ కు భయపడి బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జాతీయ పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ దృష్టి మరల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారన్నారు. రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక అన్నారు. హాయత్ నగర్ లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసీ ఏజెంట్స్ ఆత్మీయ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
సొంత లాభం కోసం మునుగోడు ఉపఎన్నిక
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... తనకు LIC విషయంలో సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఎల్ఐసీ ఏజెంట్లు మునుగోడు ఎన్నిక ఎందుకోసం ఎవరి కోసం వచ్చిందో ఒకసారి ఆలోచించాలన్నారు. ప్రజలకు సేవచేయకుండా సొంత లాభం కోసం రాజీనామా చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరిని తృప్తి పరిచేందుకు, బలవంతపు ఎన్నికలు ఎందుకన్నారు. నాలుగేళ్ల కింద ఓటు వేస్తే ఒక్కసారి మా ఊరికి రాలేదు, సమస్యలు పరిష్కరించలేదని రాజగోపాల్ రెడ్డి గురించి ప్రజలు అంటున్నారన్నారు. శివన్నగూడెం ప్రచారంలో ఎకరాకు 10 లక్షలు, ఇల్లు కట్టిస్తా అన్నారని, అది ఏమైందో చెప్పాలన్నారు.
రూ.30 వేల కోట్లు వదులుకున్నాం
"పాలసీ దారుల భవిష్యత్ మీకు ముఖ్యం. మీరు కూడా ఆలోచించాలి మునుగోడు ప్రజల కోసం. 70 ఏళ్ల ఫ్లోరైడ్ బూతాన్ని మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చి తరిమికొట్టాం. రూ.2016 పింఛన్లు ఇస్తున్నాం. నేత, గీత, వృద్ధులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు, ఇలా 45 లక్షల మందికి పింఛన్లు, పది కిలోల బియ్యం ఇస్తున్నాం. దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రం బాయిల కాడ మీటర్లు పెట్టాలి అంటున్నది. ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి చెబుతున్నా.. విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడితే 6000 కోట్లు ఇస్తామన్నారు. సంతకం పెట్టండి అన్నారు. రైతు మెడకు ఉరితాడు అవుతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఐదేళ్లలో రూ.30 వేల కోట్లు వదులుకున్నాం."-మంత్రి హరీశ్ రావు
బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు
కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు సంతకాలు పెట్టీ మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ అలా చేయలేదన్నారు. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఉండేదని, సబ్సిడీ క్రమంలోగా తెలిగించారని ఆరోపించారు. మునుగోడులో ఆత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలు మీటర్లు పెట్టేందుకు అంగీకరించారని అని మోటార్లకు మీటర్లు పెడతారన్నారు. రైతు బంధు, రైతు బీమా, తాగు నీరు, కళ్యాణ లక్ష్మి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీ ఇలా అనేక పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీజేపీ నేతలు బూతులు మాట్లాడటం తప్ప ఒకటన్నా పనిచేశామని చెప్పరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ రావొద్దనే ఉపఎన్నిక
"దుబ్బాక ఎన్నికల్లో 3000 వేలు, ఎడ్లు , బండ్లు ఇస్తాం అన్నారు. గెలిచాక దిక్కు లేదు. 8 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎయిర్ పోర్టు, రైళ్లు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు. దేశానికి బీమా సంస్కృతి నేర్పిన ఎల్ఐసీని అమ్మకానికి పెడుతున్నారు. Bsnl లో 75 వేల ఉద్యోగాలు తీసేశారు. రేపు ఎల్ఐసీ పరిస్థితి అంతే. ఆకలి రాజ్యంగా దేశాన్ని మార్చారు. ఆకలిసూచిలో దేశం 107వ స్థానంలో ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేపని చేస్తున్నారు. తెలంగాణ పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలా ఇంకా ఉదాహరణలు ఉన్నాయి. వ్యక్తి ప్రయోజన ముఖ్యమా... వ్యవస్థ ముఖ్యమా ఆలోచించండి. 18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చింది. జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ రావొద్దని మునుగోడు ఎన్నిక తెచ్చారు. కుట్రతో తెచ్చిన ఎన్నిక, వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి తెచ్చిన ఎన్నిక."-మంత్రి హరీశ్ రావు