Komatireddy Audio Leak : మునుగోడు ఉపఎన్నికలో ఆడియో లీక్ ల కలకలం రేపుతున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ బీజేపీ నేతకు ఫోన్ చేసి సహకరించాలని కోరినట్లు ఓ ఆడియో వైరల్ అయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెనర్  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాయిస్ అంటూ ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పార్టీలకతీతంగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ ఆడియోలో కోరారు. వెంకటర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. అయితే తమ్ముడికి సపోర్టుగా వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో తాజాగా వైరల్ అవుతోంది. 






పీసీసీ ప్రెసిడెంట్ అవుతా! 


మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో వెలుగుచూసింది. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో  చక్కర్లుకొడుతోంది. ఫోన్ కాల్ సంభాషణలో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నట్లు ఉంది. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అధికారంలోకి తీసుకొస్తానన్నారు.  పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా...చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటానన్నారు. 



ఆడియోలో వాయిస్ ఇలా! 


"రేపు ఏం జరిగినా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతాను. అన్నీ నేను చూసుకుంటా. ఈసారి పార్టీలకతీతంగా సాయం చేయండి. ఈ దెబ్బకు నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాను. మనిషిని చూసి చేస్తున్నాం పార్టీ కాదు. ఈ ఒక్కసారికి పార్టీలు చూడకండి. నేను వచ్చి కలుస్తాను." 


మునుగోడులో ప్రచారంపై క్లారిటీ 


మునుగోడు ఉపఎన్నిక ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల స్పష్టత ఇచ్చారు. ప్రచారానికి హోంగార్డులు ఎందుకు, ఎస్పీ స్థాయి వాళ్లే వెళ్తారని వ్యంగ్యంగా మాట్లాడారు.  తాను ప్రచారానికి వెళ్లనని పరోక్షంగా చెప్పారు. మునుగోడులో తన లాంటి హోమ్‌గార్డ్స్‌ ప్రచారం అవసరం లేదని, ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నేత చెప్పారు, ఆయనే మునుగోడు ఉపఎన్నికల్లో గెలిపిస్తారంటూ రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తనతో ఏం పనిలేదన్నారు.