Komatireddy Rajagopal Reddy : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారని, కానీ కేసీఆర్ కుటుంబం బాగుపడిందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గుండె నిండా ఎంత నిజాయితీతో రాజీనామా చేశానన్నారు. అసెంబ్లీలో ఎన్నిసార్లు మొత్తుకున్నా తన నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోలేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మునుగోడు నియోజకవర్గ సమస్యల కోసం అసెంబ్లీలో ఎక్కువ సేపు కొట్లాడానన్నారు. నిజంగా గుండె మీద చెయ్యి వేసుకుని మహిళలు చెప్పండి ఎనిమిదేళ్లలో మీ బతుకులు ఏమైనా మారాయా అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 


ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు


"టీఆర్ఎస్ వాళ్లు బీరు బిర్యానీ ఇచ్చి డబ్బులతో ఓట్లు కొనుక్కోవడానికి వస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇల్లులు కట్టేలేదు. కనీసం పేదవాళ్లకు ఇల్లు కట్టడానికి మూడు లక్షల రూపాయల ఇవ్వమని అడిగాను. రైతుబంధు భూస్వాములకు వద్దని చెప్పాను. కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని మొత్తుకొని చెప్పాను.  సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వండి, సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వండి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి అని అసెంబ్లీలో చెప్పినా వినకుండా  కోట్ల రూపాయలు భూస్వాములకు రైతుబంధు రూపంలో ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పైసలు పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలి కానీ ఇలా భూస్వాములకు ఉపయోగపడదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 90 మందిని గెలిపించి టిఆర్ఎస్ అధికారం ఇచ్చారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వం చేసే అన్యాయాన్ని అవినీతినిని అడగడానికి తెలంగాణ ప్రజలు 18 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  గెలిపించారు. కానీ ప్రజల వైపు అడిగే వారి లేకుండా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించే వారే లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుక్కున్నారు కేసీఆర్. " -రాజగోపాల్ రెడ్డి 


అప్పుల కుప్పగా రాష్ట్రం 


మునుగోడు ప్రజల కోసం తన పదవిని త్యాగం చేసి రాజీనామా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా చేసిన మరుక్షణమే గట్టుప్పల్ మండలం ఏర్పాటు అయిందన్నారు. టీఆర్ఎస్ పాలన పోవాలని, ప్రజలకు మేలు చేయాలని పార్టీ మారానన్నారు.  కేసీఆర్... పెన్షన్ డబ్బులు ఆయన ఇంట్లో నుంచి, ఆయన జేబులో నుంచి  ఇవ్వడం లేదన్నారు. బీజేపీని గెలిపిస్తే పెన్షన్ రూ. 3000 ఇప్పిస్తామన్నారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి అవసరమా? అంటూ నిలదీశారు. మంత్రికి ధైర్యం ఉంటే కేసీఆర్ తో మాట్లాడి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా అని చాలాసార్లు చెప్పానన్నారు. జగదీశ్ రెడ్డి మంత్రివే, కేటీఆర్ మంత్రినే కానీ కేటీఆర్ నియోజకవర్గం ఎలా ఉందో చూడాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు మంత్రి జగదీశ్ రెడ్డి  కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు వేల కోట్లకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల  రీడిజైన్ పేరు మీద సీమాంధ్ర కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.  గులాబీ కండువా కప్పుకోవాలని గ్రామాలలో నాయకుల్ని బెదిరిస్తున్నారన్నారు. 


కవితకు 600 మద్యం షాపులు! 


"మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోతారు. నాకు నమ్మకం ఉంది మీ పైన. వాళ్లు లక్ష రూపాయలు ఇచ్చినా తినిపించినా తాగిపిచ్చిన మీరు ధర్మం వైపు నిలబడతారు. ధర్మం వైపు నిలబడండి  మీకు అండగా నేనుంటా..  మునుగోడులోనే ఇల్లు కట్టుకొని మీకు అందుబాటులో ఉన్నా. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మునుగోడు ప్రజలు ఏమైనా అనాథలా? ఇక్కడ సరైన నాయకులు లేరా? అంటే మీరు నిలబెట్టిన అభ్యర్థి డమ్మీనా? మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. గ్రామాలలో తినడానికి తిండి లేదు ఉండడానికి గూడు లేదు కానీ రూ.200 కోట్లు పెట్టి కేసీఆర్ విమానం కొన్నాడట. మాటలు చెప్పి చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడే తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయడం లేదు కేసీఆర్. కవితమ్మ బతుకమ్మ ఆడి రూ.200 కోట్లు ముడుపులు ఇచ్చి 600 మద్యం షాపులకు ఓనర్ అయింది. రాబోయే కాలంలో మోదీ అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధికారంలోకొస్తే మన కష్టాలని తొలగిపోతాయి."   -రాజగోపాల్ రెడ్డి