Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ కోసం పార్టీలన్నీ కళ్లు కాయలు కాసేలా చూస్తున్నాయ్. రాజగోపాల రెడ్డి రాజీనామా చేసిన రోజు నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచారాల జోరు పెంచాయి. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ కాస్త క్లారిటీ ఇచ్చారు కమలనాథులు. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. మునుగోడు ప్రచారాన్ని మరింత వేగం పెంచాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉపఎన్నికకు ఇంకా 40 రోజులే ఉన్నాయని,  ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్‌ కమిటీ, పార్టీ  మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్ లతో సునీల్ బన్సల్ శనివారం సమావేశమయ్యారు. 


ఉపఎన్నిక సన్నద్ధతపై ఆరా 


మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుస్తుందని సునీల్ బన్సల్ వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జ్ లు అక్కడే  ఉండాలన్నారు. మునుగోడు నోటిఫికేషన్‌కు ముందు తర్వాత ఏయే అంశాలపై దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులకు వివరించారు. మునుగోడు నియోజకవర్గంలో వాస్తవిక పరిస్థితులు, బూత్‌ స్థాయి కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాట్లపై సునీల్ బన్సల్ చర్చించారు. మునుగోడులో బీజేపీ బలం, తాజా పరిస్థితిపై సునీల్‌ బన్సల్‌ చర్చించారు. ఉపఎన్నిక సన్నద్ధతపై సమీక్షించిన ఆయన.. మునుగోడులో పార్టీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలపై ఆరా తీశారు.  






బీజేపీ ప్లాన్


మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటి.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మునుగోడు ఉప ఎన్నిక కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.. బీజేపీ మండల ఇన్ చార్జ్ లతో పాటు సహ ఇన్ చార్జ్ లను నియమించారు. సాధారణ ఎన్నికల ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నికను భావిస్తున్నారు. అందుకే భారీగా నేతల్ని మోహరించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఓటర్లు అందర్నీ ఓ సారి కలవాలని.. షెడ్యూల్ వచ్చిన తర్వాత మరో రెండు సార్లు కలిసి ఓటు అభ్యర్థించాలని నిర్ణయించుకున్నారు.


ప్రతి ఓటర్‌ను వ్యక్తిగతంగా కలిసేలా వ్యూహం


నియోజకవర్గానికి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది కమలదళం. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిని ఆ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. స్టీరింగ్ కమిటీలో మరో 14 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులగా కీలక నేతలను నియమించారు. దాదాపు కీలక సామాజికవర్గాలను ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. నియమించిన వెంటనే వివేక్ పని ప్రారంభించారు. ఉప ఎన్నికలు ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ .. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గిరిజన బంధు ఇస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు.