Munugode Counting : దేశం మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో కేవలం మూడు రౌండ్లలోనే బీజేపీ ఆధిక్యం ప్రదర్శించగా, 12 రౌండ్లలో కారు జోరు సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లెప్ట్ పార్టీలతో పొత్తు టీఆర్ఎస్ కు కలిసొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్ విజయం సాధించడం ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ వద్ద టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. 


నల్గొండలో హ్యాట్రిక్ విజయం 


మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పై టీఆరెఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది.  హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ వరుసగా గెలుపొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది టీఆరెఎస్. తాజా గెలుపు తో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆరెఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.  



13 రౌండ్లలో కారుదే జోరు 


ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింటారు. దీనిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా, బీజేపీ 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వెయ్యికి పైగా ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం సాధించినా ఓవరాల్ గా టీఆర్ఎస్ యే ముందుంది. ఇక మూడో రౌండ్ లో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మూడో రౌండ్ లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక అక్కడి నుంచి సీన్ మారిపోయింది. కారు స్పీడ్ కు బ్రేకుల్లేకుండా పోయింది. ప్రతీ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. 


కాంగ్రెస్ ఫెయిల్ 


 మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ చతికిలపడింది. ఇటీవల ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావడం గగనం అయిపోతోంది. ఒక్క నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది. కానీ అక్కడా చతికిలపడిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా.. ఓడిపోయిన తర్వాత ఎన్ని రకాల కారణాలైనా చెప్పుకోవచ్చు.. కానీ వాట్ నెక్ట్స్ అనేది ముఖ్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా  కాంగ్రెస్‌కు ఓ పజిల్‌గా మారిపోనుంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. 


సీఈవోపై విమర్శలు 


రౌండ్ రౌండ్ కు ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడంతో టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల ప్రధాన అధికారిపై విమర్శలు చేశారు. సీఈవో తీరు అనుమానాస్పదంగా ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఈవో వికాస్ రాజ్ కు స్వయంగా ఫోన్ కూడా చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తైనా ఫలితాలు అప్ డేట్ చేయడంలేదని ఆరోపించారు. సీఈవోపై టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు. అయితే 40కి పైగా అభ్యర్థులు పోటీ పడడంతో ఓట్ల లెక్కింపులో జాప్యం జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.