Munugode By Election: మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నం అయింది. ఈ క్రమంలోని జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొత్తం నియోజక వర్గం వ్యాప్తంగా 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా.. అక్కడ ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రంలోని గదుల్లో ఫర్నీచర్, లైటింగ్, వైబ్ క్యాస్టింగ్ తోపాటు సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలిని సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్రాలన్నీ పోలింగ్ కోసం సిద్ధం అవుతున్నాయన్న ఆయన.. ఒకటో తేదీ సాయంత్రం 6లోగా స్థానికేతరులంతా నియోజక వర్గం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు. 


ప్రత్యేక నిఘా ద్వారా ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తాం..


అలాగే ప్రతీ పోలింగ్ కేంద్రంలో ప్రకాశవంతమైన లైటింగ్ లు, సిబ్బందికి అసౌకర్యం కల్గకుండా ఫ్యాన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజక వర్గంలో 105 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మిగిలిన కేంద్రాల్లో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని కేంద్రాల ద్వారా ప్రత్యేక నిఘా ద్వారా పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నకల నియమావళి ప్రకారం ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారాన్ని నిలిపి వేస్తామన్నారు.  ఆ సమయానికి స్థానికేతరులంతా నియోజక వర్గం నుంచి బయటకి వెళ్లిపోవాల్సి ఉంటుందని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 


మునుగోడు ఉపఎన్నికకు ఈసీ ప్రత్యేక చర్యలు..


మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉపఎన్నిక కోసం ముగ్గురు పరిశీలకులను రంగంలోకి దించింది. సాధారణ పరిశీలకునితోపాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్​ను ఈసీ నియమించింది. ఈయన శుక్రవారం అంటే 14వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు మునుగోడులో బాధ్యతలు నిర్వర్తిస్తారు. 


పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్​గఢ్​కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమించారు. పోలీసు పరిశీలకుడు ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ 3వ తేదీ వరకు మునుగోడు ఉపఎన్నికక కోసం విధులు నిర్వర్తిస్తారు. నవంబర్ మూడో తేదీన పోలింగ్ నిర్వహించగా.. నవంబర్ 6వ తేదీన కౌంటింగ్ చేయబోతున్నారు. 


వాడివేడిగా సాగుతున్న మునుగోడు రాజకీయం



ప్రస్తుతం మునుగోడ ఉపఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో.. అందరి దృష్టి మునుగోడు పైనే ఉంది. బీజేపీ తమ పార్టీ చెందిన ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను మునుగోడుకు తీసుకువస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాముగా తయారు అయింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఒక్క చౌటుప్పల్ మండలానికి ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఎలాంటి ఘర్షణలు, దాడులు లేకుండా ప్రశాంతంగా సాగేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.