హైదరాబాద్: తెలంగాణలో మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC, ZPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ప్రచురించాలని ఇటీవల ఆదేశించిన ఎన్నికల సంఘం తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఈసీ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి అంతా సిద్ధం చేయాలని ఉత్తర్వులలో పేర్కొంది.
ఈసీ ఉత్తర్వుల ప్రకారం..ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు సెప్టెంబరు 6న ప్రచురించాలి. సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు వాటిపై అభ్యంతరాలు, వినతుల స్వీకరించనున్నారు. ఆపై సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలి. సెప్టెంబర్ 9న ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాల్సి ఉంటుంది. చివరగా సెప్టెంబర్ 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ఫోటో ఎలక్ట్రోరల్ రోల్స్‌ను సిద్ధం చేసి, సెప్టెంబర్ 2న తుది జాబితా విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రాణి కుముదిణి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-కే కింద, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 10 మరియు 11 ప్రకారం చేపట్టారు. ఈ ప్రక్రియలో 2025 జూలై 1ను అర్హత తేదీగా తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఫోటో ఓటర్ల జాబితాలను ఆధారంగా చేసుకుని గ్రామ పంచాయతీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులతో అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఆగస్టు 31తో ముగియనుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీల వార్డుల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి, ఆగస్టు 28న పంచాయతీ స్థాయిలో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అదేరోజు జిల్లాస్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఆగస్టు 29న మండల స్థాయిలో మరో సమావేశం జరుగుతుంది.
అభ్యంతరాలను ఆగస్టు 28 నుంచి 30 వరకు స్వీకరించి, సెప్టెంబర్ 2న తుది జాబితాను ప్రకటిస్తారు. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్), డీపీవోలు, ఎంపీడీవోలు తగిన చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ సూచించింది.