MP Laxman: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుతం ప్రజలపై విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తుందని... ఇందుకు కారణం ఇది ఎన్నికల సంవత్సరం అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కల్లబొల్లి మాటలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోక తప్పదన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా.. సీతారాములకు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు కూడా సమర్పించలేని స్థాయిలో సీఎం కేసీఆర్ ఉన్నారంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈయన మాత్రమే స్వామి వారికి వస్త్రాలు సమర్పించని ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారంటూ ఫైర్ అయ్యారు. పెట్రోల్, డీజిల్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 కి పైగా పన్ను తగ్గిస్తే.. తెలంగాణలో కనీసం రూ.5 తగ్గించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనసు రావట్లేదని ఆరోపించారు. ఇంకా కేంద్ర ప్రభుత్వాన్నే తప్పుచేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఈనెల 8న 20 వేల కోట్లతో అభివృద్ధి పనులు
ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్ కు రైతులు, దళితులు, ప్రజలపై ప్రేమ పుట్టుకొస్తుందంటూ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఊసరవెల్లి రంగు మార్చినట్లు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారన్నారు. ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ఏడాది కాబట్టే రైతుల మీద ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారంటూ తెలిపారు. కేసీఆర్ కుటుంబం కలలు.. కల్లలుగానే మిగిలిపోతాయని అన్నారు. ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన రూ.20 వేల కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణలో శ్రీకారం చుడుతున్నారన్నారు. నేడు ప్రపంచ దేశాలు సైతం సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ ఉద్యమ కారులను మోసం చేస్తూ వస్తుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఉన్న బీసీలకు సముచిత స్థానం లభించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే బీసీలకు సముచిత స్థానం కల్పించి ఉన్న పదవులతో పాటు రిజర్వేషన్లు ఇచ్చారని వివరించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేశారని ఆరోపించారు. మళ్లీ అదే బాటలో కుటుంబ పాలన కొనసాగించేందుకు.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల అసంతృప్తితో ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓబీసీ మోర్చా నేతలు ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెచిలి చూపించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సవాల్ విసిరారు.