MP Laxman on BRS Party: మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని, కుటుంబ పాలన అంతమయ్యే రోజులు అతి త్వరలో ఉన్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పేరుతో గెచిలి చూపించాలని సవాల్ విసిరారు. రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలోని మహావీర్ కాలేజీలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా 3 రోజుల  ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయనతో పాటే  మాజి ఎంపీ మురళిధర్ రావు కూడా ఉన్నారు.


డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మొదటి నుంచీ ఉద్యమ కారులను మోసం చేస్తూ వస్తుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఉన్న బీసీలకు సముచిత స్థానం లభించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే బీసీలకు సముచిత స్థానం కల్పించి ఉన్న పదవులతో పాటు రిజర్వేషన్లు ఇచ్చారని వివరించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేశారని ఆరోపించారు. మళ్లీ అదే బాటలో కుటుంబ పాలన కొనసాగించేందుకు.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. దమ్ముంటే మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పేరుతో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. 


వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల అసంతృప్తితో ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓబీసీ మోర్చా నేతలు ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. 


కేసీఆర్, కేఏ పాల్ పొత్తు పెట్టుకుంటారేమో : బండి సంజయ్


టీఆర్ఎస్ పార్టీ విమానం కొనుగోలుపై బండి సంజయ్ ఇటీవలే విమర్శలు చేశారు. కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారని చెప్పారు. భవిష్యత్ లో బీఆర్ఎస్, ప్రజాశాంతి పార్టీ పొత్తు పెట్టుకుంటారేమో అన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే కేసీఆర్ జాతీయ పార్టీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. మునుగోడు ఉపఎన్నిక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ ప్రకటన చేశారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలు  టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ అని పేరు మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారనే నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. టీఆర్‌ఎస్‌ పేరుతో మునుగోడు ఉపఎన్నికలో ఓటు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదని ఆక్షేపించారు. జాతీయ పార్టీ నాయకులను టూరిస్ట్ అంటూ విమర్శలు చేసిన కేసీఆర్.. అదే టూరిస్టు మాదిరిగా కేసీఆర్ ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు ఏం చేస్తాయని ప్రశ్నించిన కేసీఆర్.. ఎందుకు జాతీయ పార్టీ పెట్టారని నిలదీశారు.