భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అందుకోసం ఆయనకు ప్రధాని అపాయింట్‌మెంట్ నేడు ఖరారైంది. రేపు (డిసెంబరు 16) ఉదయం మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయానికి రావాలని పీఎంవో నుంచి కోమటిరెడ్డికి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గం భువనగిరిలో అభివృద్ది పనులపై చర్చించడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోదీ అపాయింట్మెంట్ కోరారు. మోదీ కలిసే సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరిన్ని కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాలుష్యం కారణంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని దృష్టికి తేనున్నట్లు సమాచారం. నమామి గంగ తరహాలో నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రధానిని కోరతారని అంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‌కు సంబంధించి కూడా పలు అంశాలపై ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ హైవే గురించి కూడా వివిధ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పరిణామంతో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖర్గేతోనూ భేటీ
ఇటీవలే పీసీసీకి చెందిన కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. కొన్నాళ్లుగా ముఖ్యంగా తమ్ముడు బీజేపీలో చేరిన నాటి నుంచి కోమటిరెడ్డి అంటీముట్టనట్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదు. పైగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. తర్వాత ఇటీవల పీసీసీ కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి నిన్న (డిసెంబరు 14) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై తాను ఖర్గేతో చర్చించానని, ఖర్గే అంతా విన్నారని ఆయన్ని కలిశాక వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారని అన్నారు. కీలక విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఖర్గేకు కోమటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే, ఆ విషయాలు విన్న అనంతరం తాను త్వరలోనే తెలంగాణ నేతలతో సమావేశం అవుతానని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.
మొత్తానికి అగ్రనేతలను వరుసగా కలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో ఏం మంతనాలు జరుపుతున్నారని ఆసక్తికరంగా మారింది.