Chapra Hooch Tragedy:
అసెంబ్లీలో రగడ..
బిహార్‌లోని చప్రాలో కల్తీ లిక్కర్ తాగి పలువురు మృతి చెందిన ఘటన...అసెంబ్లీని ఊపేస్తోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 39కి పెరిగింది. బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడుతోంది. మద్య నిషేధం సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి మరణాలు నమోదవుతున్నాయని విమర్శిస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే...దీనిపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ఇలా కల్తీ లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారున్నారని అన్నారు. బిహార్‌లో మాత్రం మద్య నిషేధం చాలా పక్కాగా అమలవుతోందని, కల్తీ మందు తాగిన ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. బిహార్‌లో మద్య నిషేధం అమలుపై ప్రస్తావన రాగా...నితీష్ కుమార్ సమాధానమిచ్చారు. "అన్ని పార్టీల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ దీని అమలు కోసం కట్టుబడి ఉన్నారు. కానీ... మనం ఎంత మంచి చేసినప్పటికీ ఎవరో ఒకరు చెడు చేయాలని చూస్తారు. నేరాలు అడ్డుకోటానికే కదా మనం చట్టాలు చేసుకుంది. కానీ...హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనిబీజేపీ చెబుతోంది. కానీ చాలా మంది లబ్ధి పొందారని మేం కచ్చితంగా చెప్పగలం" అని వెల్లడించారు నితీష్ కుమార్. రాష్ట్రంలో చాలా మంది మద్యం సేవించడం మానేశారని, భర్త తాగుడు మానాడన్న ఆనందం ఎంతో మంది మహిళల్లో ఉందని తెలిపారు. మద్యం సేవించడం మానేసి కుటుంబ బాధ్యతలు పంచుకుంటున్నారని చెప్పారు. "మద్యం మానేసి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్లెందరో ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనను మాత్రం అసలు ఉపేక్షించం. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారెవరైనా సరే వారిని పట్టుకుంటాం. కఠినంగా శిక్షిస్తాం" అని తేల్చి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కల్తీ మందు తాగి చనిపోతున్న వారు లేరా అని ప్రశ్నించారు.
ఫైర్ అయిన నితీష్..
దీనిపై బీజేపీ సభలో పదేపదే వాదనకు దిగింది. ఇదే కంటిన్యూ అవుతుండటం వల్ల నితీష్ కుమార్ సహనం కోల్పోయారు. ఉన్నట్టుండి సీట్‌లో నుంచి లేచి మైక్ అందుకుని గట్టిగా మాట్లాడారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కళ్లురుముతూ బీజేపీ నేతలకు వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు "అరవకండి" అంటూ నినదించినా...నితీష్ కుమార్ అస్సలు ఆగలేదు. "మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంతా మద్దతిచ్చారు కదా. అందుకు మీరే సాక్ష్యం కదా. మరి ఇప్పుడు ఇలా రివర్స్‌లో మాట్లాడటమేంటి..? అప్పుడు అంగీకరించిన వాళ్లంతా ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారు. ఇంకా లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని ఎలా ఆరోపిస్తున్నారు..? చెత్త రాజకీయాలు చేయకండి. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోండి" అని విరుచుకుపడ్డారు. దీనిపై..బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ డిప్యుటీ సీఎం, బీజేపీ నేత తారాకిషోర్ ప్రసాద్ స్పందించారు. "మద్య నిషేధానికి మేం సపోర్ట్ చేశాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేం ఆ బిల్లుకి
మద్దతునిచ్చాం. కానీ...ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది" అని విమర్శించారు.
Also Read: Bengaluru News: పెళ్లయిన 3 నెలలకే- భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!