తెలంగాణలో దళితులకు సమ న్యాయం కల్పించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్రంలో 75 లక్షలకు పైగా దళితులు ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబుతున్నారని.. అలాంటప్పుడు మంత్రి వర్గంలో కేవలం ఒకే ఒక దళిత మంత్రికి చోటు కల్పించారని విమర్శించారు. కరోనా వల్ల దళిత బంధు ఆపేశారన్న సీఎం కేసీఆర్ మాటలను కూడా అర్వింద్ తప్పు బట్టారు. కరోనా కాలంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టారని, దళిత బంధు ఇచ్చేందుకు అది ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటి నుండి గ్యాప్ లేకుండా కేసీఆర్‌ను నిద్ర పోనివ్వబోమని హెచ్చరించారు. 25 ఏళ్ల కింద సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతితో సిద్దిపేట దళితులు కోటీశ్వరులు అయ్యారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌కి 2023 వరకు రెండో కొడుకు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు.
కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకో..: అర్వింద్
‘‘ఇండియా టుడే సర్వేలో టాప్ 10 సీఎంల స్థానాల్లో కేసీఆర్ లేడు. నీ స్థానం ఎలా దిగజారుతోందో చూసుకో. అవినీతి పెరిగిపోయింది. తెలంగాణ ట్రాన్స్ కో ఇప్పటిదాకా రూ.లక్షా 10 వేల కోట్ల అప్పుల పాలైంది. కొన్న ప్రతి యూనిట్‌కి రూపాయి కమీషన్ నీ కొడుకే తీసుకుంటున్నాడు. సీఎం సిగ్గు లేనోడు. చెప్పిన అబద్దమే మల్ల మల్ల చెప్తడు. ఎస్సీలకు ఎందుకు రాజ్యాధికారం ఇవ్వలేదు. నీకు సిగ్గు మానం లేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికే మంత్రి పదవి ఇస్తవా. రాష్ట్రంలో 75 లక్షల దళిత జనాభా ఉందని నువ్వే చెప్తివి. ఇదేనా నీ పవిత్రత. కేంద్ర కేబినెట్‌లో సామాజిక న్యాయం ఉంది. 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 27 మంది బీసీలు, 11 మంది మహిళలు ఉన్నారు. నీ మంత్రి వర్గంలో 11 మంది ఓసీలు ఉన్నారు. నరేంద్ర మోదీ పాదాలు కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకో కేసీఆర్.
బొంద పెట్టడమే నా కర్తవ్యం
దళిత బంధు ఇవ్వకుండా ఒక్క దళిత కుటుంబం మిగిలినా నీకు తిప్పలు తప్పవు. బద్దలు బాసింగాలు అవుతయ్. దళితులకు లక్షా డెబ్భై వేల కోట్లు ఇవ్వాలంటే కేసీఆర్ మనువడు ముసలోడు కావాలె. కేసీఆర్ పతనం చూసే వరకు నిద్ర పోయేది లేదు 2023లో టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం నా కర్తవ్యం. రైతులకు మీటర్లు పెట్టాలని ఎక్కడ చెప్పలేదు. రైతుల ఇండ్లలో కూడా మీటర్లు పెట్టొద్దు. హుజూరాబాద్ బస్ స్టాండ్ కూర్చోండి.. కేంద్రం డ్రాఫ్ట్ బిల్లు లో మీటర్లు బిగించాలని ఎక్కడో ఉందో చుపెట్టు అని ఎద్దేవా చేశారు.
అంబేడ్కర్ విగ్రహం ఏమైంది?
ఓటమి భయనికే పథకాలు పెడుతున్నవ్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు దళిత బంధు, హుజూరాబాద్‌లో కులసంఘాలకు భూమి, జర్నలిస్ట్‌కి భూమి లాంటి హామీలన్నీ హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందే ఇవ్వాలి. బెవకూఫ్ సీఎం నీకు వివరం ఉందా? పంటలకు బోనస్ లేదు. ఎంఎస్పీ కేంద్రం ఇస్తుంది కాబట్టే రైతులు వరి పంట పండిస్తున్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ ఏమైంది? రాష్ట్రంలో 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు ఉన్నారు అన్నావు.. ఇదంతా అంబేడ్కర్ గారి పుణ్యం. మరి ఆయన విగ్రహం ఏది? 125 అడుగులు అన్నావు ఏమైంది. దళిత బంధుకు రూ.1.7 లక్షల కోట్లు పెద్ద విషయం కాదు అంటున్నవు.. ఆయుష్మాన్ భవ, ఆవాస్ యోజనకి ఎందుకు కిస్తీలు కట్టడం లేదు. నీ కుటుంబం బాగు పడింది తప్ప ప్రజలు కాదు. నువ్వు తెచ్చిన అప్పుల్లో రూ.4.5 లక్షల కోట్లలో 30 శాతం కమీషన్ తీసుకొని రూ.1.70 లక్షల కోట్లను నీ కుటుంబం జేబులో వేసుకుంది.’’ అని అర్వింద్ మండిపడ్డారు.
కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, హుజురాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.