హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చారని బండి సంజయ్ విమర్శించారు. గతంలో ఇచ్చిన ఏ హామీలను సీఎం అమలు చేయని పరిస్థితి ఉందన్నారు.  నిరుద్యోగ భృతి పథకం అటకెక్కిందని, రైతు ఋణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలన్నారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు పథకాలు కూడా అమలు చేయాలని బండి సంజయ్  డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు గుప్పించారు. 


ఇంకా.. బండి సంజయ్ ఏం మాట్లాడారంటే..



  • టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడమే ‘బీజేపీ దరఖాస్తుల ఉద్యమం’ ప్రధాన ఉద్దేశం. పేదలకు లబ్ధి చేకూర్చేందుకు బీజేపీ ఈ పభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉంది. 
    అంబేద్కర్ పట్ల గౌరవం ఉంటే.. దళితుల పట్ల ప్రేమ ఉంటే... ‘దళిత బంధు’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్క దళితులకు అమలు చేయాలి.

  • ‘బీసీ బంధు’, ‘గిరిజన బంధు’ పథకాలను ప్రభుత్వం వెంటనే రూపొందించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీసీ కుటుంబాలు, 10 లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలి.
    రాష్ట్రంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతీ, యువకులకు 2018లో టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ప్రతినెలా రూ.3116లు మంజూరు చేయాలి.

  • 2018 నుండి ఇప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయల బకాయి ఇవ్వాలి. ఆ మొత్తంతోపాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
    రూ.లక్షలోపు బకాయి ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చి రూ.50 వేలలోపు రుణాలనే మాఫీ చేస్తానని కేసీఆర్ ద్వంద్య మాటలు, ద్వంద్య మోసాలు చేస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల సొమ్మును కూడా రైతుల ఖాతాల్లో వేయడం లేదు. ఇప్పటికైనా సీఎం ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయి రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం.

  • ఇల్లులేని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, జాగా ఉంటే 5 నుండి 6 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. హామీ అమలు చేస్తే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరేది. ఆ హామీని అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేందుకే ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపట్టాం.

  • దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల పొలం మంజూరు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో, 2018 అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇచ్చిండు. ఆ హామీ నెరవేరిస్తే ప్రతి దళిత కుటుంబానికి రూ.30 లక్షల లబ్ది చేకూరేది. వాటిని అమలు చేయాలని ఒత్తిడి చేసేందుకే ఈ ఉద్యమం చేపట్టినం.

  • ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీలన్నీ అమలు చేయించేలా ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేకూర్చడమే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. దీనిని రాజకీయం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్సే. గాంధేయ పద్ధతిలోనే ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా ప్రజల్లోకి తీసుకెళతాం.
    ’దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేసి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అమలు చేయకపోవడమ దళితులను మోసగించడమే.


Also Read: KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన