రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేశ్‌కు ఈ ప్రాంత వాసినని తెలియలేదని ఎంపీ అవినాష్ రెడ్డి నారా లోకేశ్ కు కౌంటర్ వేశారు. లోకేశ్‌ యువగళం పాదయాత్రపై ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 13) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ వారికి గుర్తే లేదని విమర్శించారు. అబద్ధాలకోరులను ప్రజలు ఎవరూ నమ్మరని అవినాష్‌ రెడ్డి అన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు గుర్తుకు రాని రాయలసీమ ఇప్పుడే గుర్తొచ్చిందా అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. లోకేష్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. 


నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 125వ రోజుకు చేరుకుంది. మొదటి నుంచి రాయలసీమలో యాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్‌, మంగళవారం (జూన్ 13) నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గంలో భారీగా టీడీపీ శ్రేణులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.  సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలంలోకి ప్రవేశిస్తారు. నాలుగు రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించి 16వ తేదీ రాత్రికి వెంకటగిరి నియోజకవర్గానికి చేరుకుంటారు. ఆత్మకూరు నియోజకవర్గంలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నిర్వహణ బాధ్యతలను వెంటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి భుజానికి ఎత్తుకొని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.