హైదరాబాద్‌ నగర శివారు, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలోని హెచ్‌ఎండిఏ ప్లాట్ల వేలానికి విశేష ఆధరణ లభిస్తోంది. బుధవారం ఆన్‌లైన్‌లో రెండో విడత వేలం నిర్వహించారు. రెండు సెషన్స్‌గా ఈ వేలం జరిగింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఫస్ట్ సెషన్‌లో 30 ప్లాటకు వేలం వేశారు. ఇక, మధ్యాహ్నాం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సెకండ్ సెషన్‌ జరిగింది. సెకండ్‌ సెషన్‌లో మరో 30 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. 20,025 చదరపు గజాల ఈ ప్లాట్లలో ...గజం కనీస ధరను 25 వేలుగా నిర్ణయించారు. అయితే, గరిష్టంగా గజం ధర రూ.లక్ష పలికినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గజం కనిష్ట ధర 63వేల 513 రూపాయలు పలికినట్లు తెలిపారు. రెండో విడత వేలంలో మొదటి రోజే... హెచ్‌ఎండీఏకి రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది. 


ఉదయం సెషన్‌లో 30 ప్లాట్లకు నిర్వహించిన వేలంలో... గజానికి అత్యధిక ధర 72 వేలు, కనిష్ట ధర రూ.54 వేలు పలికింది. సగటున గజం ధర రూ.61,815 పలికింది.  మధ్యాహ్నం సెషన్​లో 30 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. అత్యధికంగా గజం లక్ష రూపాయలు పలికింది. కనిష్ట ధర 55 వేలు రూపాయలు పలికిందని అధికారులు తెలిపారు. సగటున 65వేల 125రూపాయలు పలికినట్టు ప్రకటించారు. 


నిన్న ఒక్కరోజే 58 ప్లాట్లను హెచ్ఎండీఏ ఆన్‌లైన్‌లో విక్రయించగా... నేటి నుంచి ఈనెల 29 వరకు రోజూ వేలం నిర్వహించనున్నారు. రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి ఉంచింది. ఒక్కో గజానికి అప్‌సెట్‌ రేటు రూ.25 వేలుగా నిర్ణయించారు. మొత్తం ప్లాట్ల విక్రయంతో సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. 


హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ మోకిలలో వేస్తున్న భారీ వెంచర్‌లో వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్‌ఎండిఏ... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ద్వారా వేలం ప్రక్రియ నిర్వహిస్తోంది. మోకిల హెచ్‌ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్‌కు దగ్గరలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్లే మంచి డిమాండ్ వస్తోందని నిపుణలు చెప్తున్నారు. అంతేకాక, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసే లేఅవుట్లలో మౌలిక సదుపాయలు బాగుంటాయన్న విశ్వాసం కూడా కొనుకోలుదారుల్లో కనిపిస్తోంది. వివాదరహితమైన ఆ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ అనుమతులు కూడా సులభంగా లభిస్తాయన్న నమ్మకం కూడా... అధిక రేటు పలికేందుకు దోహదపడుతుందని చెప్తున్నారు.


మోకిల్లా భూముల మొదటి దశ వేలంలో 50 ప్లాట్లను విక్రయించింది హెచ్‌ఎండీఏ. వేలంలో చదరపు గజం గరిష్ఠంగా లక్షా 5వేల రూపాయలు పలికింది. క‌నిష్ఠంగా గ‌జం ధర రూ. 72 వేలు పలికింది. మొదటి దశలో సగటున చదరపు గజం భూమి ధర 80వేల 397 రూపాయలు పలికినట్లు అధికారులు తెలిపారు.