MMTS Trains in Hyderabad: జంట నగరాల్లో నివసిస్తున్న వారికి మెట్రో కన్నా ముందు నుంచి ఎంఎంటీఎస్ మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది. మెట్రోలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మెట్రో రైలు లేని ప్రాంతాల్లో ఎంఎంటీఎస్‌లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. పైగా మెట్రోతో పోలిస్తే.. వీటి ఛార్జీలు చాలా కూడా తక్కువే. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్, స్టూడెంట్స్, కూలీలు ఇలా నిత్యం చాలా మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు.
వారందరికీ దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన అందించింది. ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే సంస్థ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల (FOB)ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య ప్రయాణికులకు నిత్యం సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను క్యాన్సిల్ చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య సర్వీసులను అందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్ని రైళ్లను ఒక్కరోజు పాటు సర్వీసులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందించే ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కువగా లేవు. ఈ క్రమంలో ఆ మధ్య దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.. సనత్‌నగర్-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను అందుబాటులోకి వచ్చింది. రక్షణశాఖ – రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం వంటి పనులను పూర్తి చేశారు.
సనత్‌నగర్-మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ ట్రైన్లను కూడా ప్రధాని మార్చిలో ప్రారంభించారు. చర్లపల్లి స్టేషన్ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 ప్యాసింజర్ ట్రైన్లు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులను చేరవేయాలన్నా.. ఆయా స్టేషన్లలో దిగినవారిని నగరానికి తరలించాలన్నా.. ఎంఎంటీఎస్‌లు కీలకం కానున్నాయి. సనత్‌నగర్-మౌలాలి లైనుతో ఇది సాధ్యమైంది.