MLC Kavita: తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. శనివారం ఉదయం   తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కవిత మాట్లాడారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని అన్నారు.   





 


స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని విమర్శించారు. తలాతోక లేని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలేని మాటలు మానుకోవాలని హితవుపలికారు.


అసెంబ్లీలో తీర్మానం సమయంలోనూ కేటీఆర్ ఇదే డిమాండ్ వినిపించారు. రాష్ట్రప్రభుత్వం బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలన్నారు మాజీమంత్రి కేటీఆర్. బీసీ కులగణనకు చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్‌ అయినా వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్‌.  అవసరమైతే మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలని పొడిగించాలన్నారు. కుల గణన కోసం బిల్లు తీసుకొస్తే బీఆర్‌ఎస్‌ తరపున సంపూర్ణ మద్దతిస్తామని స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు అన్నింటినీ అమలు చేయాలని.. అప్పుడే కులగణన సక్సెస్ అవుతుందని చెప్పారు కేటీఆర్.


బలహీనవర్గాలకు లాభం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు కేటీఆర్. బీసీల కోసం మంత్రిత్వ శాఖను పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని గుర్తు చేశారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలోనే డిమాండ్‌ చేశామని, రాష్ట్ర అసెంబ్లీనుంచి రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించామని తెలిపారు. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లు అయినా వస్తాయని చెప్పారు కేటీఆర్. మరోవైపు కులగణన విషయంలో కేటీఆర్, కడియం కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వారు కన్ఫ్యూజ్ అవడంతోపాటు సభను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పారు. తీర్మానం క్లియర్ గా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా కన్ఫ్యూజన్ లేదన్నారు.