Janasena Leader Nagababu News : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఆ పార్టీ ముఖ్య నేత నాగబాబు ఉత్తరాంధ్ర నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీకి పని చేస్తానని నాగబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ కేడర్‌ను ఉత్సాహ పరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరి పోటీ చేయరన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. కానీ, అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న భావనకు వచ్చిన నాగబాబు.. ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గాన్ని ఇందుకు ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు. ఆ నియోజకవర్గమే అనకాపల్లి పార్లమెంట్‌ స్థానమని పేర్కొంటున్నారు. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాగబాబు.. అందుకు అనుగుణంగా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకునే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లోనే ఆయన మూడుసార్లు ఈ ప్రాంతానికి వచ్చి నేతలతో సమావేశమవుతున్నారు. రెండు రోజులు కిందట విశాఖ వచ్చిన ఆయన అనకాపల్లి, తదితర ప్రాంతాల్లోని నాయకులతో సమావేశమయ్యారు. తాజాగా మాజీ మంత్రి, అనకాపల్లిలో సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణతోనూ వారి ఇంటికి వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


అచ్యుతాపురంలో నాగబాబుకు ఇళ్లు


అనకాపల్లి బరి నుంచి దిగేందుకు సిద్ధపడుతున్న నాగబాబు.. ఇక్కడే ఉండేందుకు అనుగుణంగా ఇంటిని అద్దెకు తీసుకున్నారు. లోక్‌సభ స్థానం పరిధిలోని అచ్యుతాపురంలో ఉండేందుకు అనుగుణంగా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అచ్యుతాపురం నుంచి గాజువాక వెళ్లే రహదారిలో రామన్నపాలెం వద్ద ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌ ఉంది. దీనికి ఆనుకుని జనసేన పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సుందరపు విజయ్‌ కుమార్‌ ఇటీవల నూతనంగా గృహాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనం కింది భాగంలో నాగబాబు నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాగబాబు నివాసంతోపాటు ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌లో సుమారు పది గృహాలను అద్దెకు తీసుకున్నారు. ఎన్నికల కార్యకలాపాలన్నీ అచ్యుతాపురం కేంద్రంగా నిర్వహించేందుకు అనుగుణంగానే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. సిబ్బంది ఉండడానికి కూడా మరో పది ఇళ్లను అద్దెకు తీసుకున్నట్టు చెబుతున్నారు. నాగబాబు చేసుకుంటున్న ఏర్పాట్లతో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు బలాన్ని చేకూర్చినట్టు అయింది. ఇదే నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం నుంచి అల్లు అరవింద్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. 


టికెట్‌ ఇచ్చేందుకు అవకాశం


అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. ఆడారి కిషోర్‌తోపాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ, జనసేన ఈ స్థానాన్ని కోరితే ఇచ్చేందుకు టీడీపీ కూడా సానుకూలతను వ్యక్తం చేసే అవకాశం ఉంది. అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ మంత్రి కొణతాల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఆ స్థానం ఇచ్చేందుకు కుదరకపోతే ఆయన్ను పార్లమెంట్‌ బరిలోకి దించాలని జనసేన భావించింది. కానీ, నాగబాబు ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటుండడంతో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి నాగబాబు, అసెంబ్లీ స్థానం నుంచి కొణతాల బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ రెండు స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సానుకూలంగా ఉంటుందా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది. ఇక్కడ అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు గడిచిన కొన్నాళ్లు నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారయణ పని చేస్తున్నారు. ఆయనకు కాదని టికెట్‌ మరొకరికి కేటాయిస్తారా.? అన్నది కూడా సందేహంగానే ఉంది. ఈ రెండు స్థానాలపై ఇరు పార్లీల లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి.