MLA Mal Reddy Ranga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ హీట్ కనిపిస్తోంది. హైకమాండ్ నుంచి పేర్లు రాకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఉగాది రోజు అనుకున్నారు. కానీ జరగలేదు. ఆ రోజు సీఎం రేవంత్.. గవర్నర్ ను కలవడంతో మూడో తేదీన మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అనుకున్నారు. మూడో తేదీ వచ్చినా కాంగ్రెస్ లో ఎలాంటి సందడి కనిపించడం లేదు. అయితే ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు.                        

రెడ్డి సామాజికవర్గం అయినందున అవకాశం ఇవ్వలేకపోతే.. ఏ సామాజికవర్గానికి అవకాశం ఇస్తారో చెబితే ఆ సామాజికవర్గం నేతను తన నియోజకవర్గం ఇబ్రహీపట్నం నుుంచి నిలబెట్టి గెలిపిస్తానని ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లలో ఇబ్రహీంపట్నం ఒకటి. గ్రేటర్ లో ఇంకెక్కడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ఈ సమీకరణాలతో తనకు అవకాశం వస్తుందని మల్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే మొత్తం  భర్తీ చేసే సీట్లలో  రెడ్డి సామాజికవర్గానికి ఒకటే ఇస్తారని భావిస్తున్నారు. ఇది ..  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇంకా.. ఒత్తిడి ఉంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికి నల్లగొండ నుంచి ఇద్దరు రెడ్డి సామాజికవర్గ మంత్రులు ఉన్నారు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కూడా ఒకరు.

ఒకే జిల్లాకు మూడు రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే .. అదీ కూడా సోదరులిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ఇతర రెడ్డి సామాజికవర్గం ఎమ్యేల్యేలు అంటున్నారు. అందుకే రాజీనామా చేస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి అంటున్నారు. గత ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై 40,127ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 38 ఏండ్ల తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. . కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం అభ్యర్థి ఒక్కసారి గెలిచినప్పటికీ నేరుగా కాంగ్రెస్ నేతలు గెలుపొందలేదు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఏజీ కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో సీపీఎం, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు.అసాధ్యం అనుకున్న చోట భారీ విజాయన్ని సాధించి పెట్టానని అందుకే తనకు మంత్రి దవి ఇవ్వాలని మల్ రెడ్డి కోరుతున్నారు. 

మల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.   2014లో కాంగ్రెస్‌ టికెట్‌కోసం ప్రయత్నించినప్పటికీ ఆయనను మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించగా.. టికెట్‌ రాకపోవటంతో 2018లో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2023లో విజయం ఆయన సొంతమైంది.