Minister Talasani: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం రోజు జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను ఎవరినీ కావాలని నెట్టివేయలేదని.. తన కాలికి గాయమై రక్తం వస్తుండడం వల్లే అలా చేసినట్లు వివరించారు. ఆ తర్వాత కాసేపటికే అతనెవరో తెలుసుకొని ఫోన్ చేసి మరీ క్షమాపణ చెప్పానని.. అన్నారు. కావాలనే కొందరు దీన్ని సోషల మీడియాలో పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయొద్దని కోరారు. 






మంత్రి మాటల్లోనే.. 


"ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ రోజున శ్రీ కేటీఆర్ గారు వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడింది. ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడు. నా కాలుకు గాయమై రక్తమొచ్చింది. ఆ సందర్భంగా నే ఆ వ్యక్తిని నెట్టి వేశాను. సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. అతను బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్  కుమార్ బాబు అని తెలిసింది. ఆయన గిరిజన బిడ్డా వెంటనే ఆయనకు  ఫోన్ చేసి సారి చెప్పాను. దీనిపై కావాలనే నాపై సోషల్ మీడియాలో  ప్రచారం చేస్తున్నారు. నేను బడుగు బలహీన దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకను. తెలంగాణ లో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తాను. ఆరోజు జరిగిన ఘటనపై వాళ్ల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్న." - మంత్రి తలసాని


అసలేం జరిగిందంటే..?


హైదరాబాదులో శనివారం (ఆగస్టు 19న) జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ మంత్రి కేటీఆర్ ప్రక్కన ముందుకు వెళ్తున్న భైంసా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నెట్టివేశారు. కోపంతో ఊగిపోతూ చెంప పగులగొట్టారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నేతలందరూ స్పందించారు. ఓ గిరిజన బిడ్డపై మంత్రి ఇలా దాడికి పాల్పడడం, అవమానించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి తలసాని దిష్టిబొమ్మకు లోకేశ్వరం మండలం రాజేశ్ తండా, పుస్పూరుతో పాటు పలు గ్రామాల్లో శవయాత్ర నిర్వహించారు. పాడెకట్టి దిష్టిబొమ్మ పెట్టి.. డప్పు భాజాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి.. దహనం చేసి తమ నిరసన తెలిపారు. నిర్మల్, భైంసా, ముధోల్, ఖానాపూర్ తో పాటు గ్రామాల్లోనూ గిరిజన సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లోకేశ్వరం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.