TTD Board Members: టీటీడీ విషయంలో ఏపీ ప్రభుత్వం వరుసగా వివాదాలకు కేంద్రంగా మారుతోంది. 2021లో 25 మందితో కూడిన నూతన జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. 80 మందితో టీటీడీ పాలకమండలి సిద్ధమైంది ఏర్పాటుతో పెద్ద వివవాదమే రేగింది. ఈఓగా పనిచేస్తున్న ధర్మారెడ్డిని ఐదేళ్ల పాటు వివిధ పదవుల్లో అక్కడే కొనసాగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా టీటీడీ చైర్మన్‌గా భూమన కరణాకర రెడ్డి నియామకం సైతం వివాదాస్పదం అయింది. భూమన హిందువు కాదంటూ పలు ఆరోపణలు సైతం వచ్చాయి. భక్తులపై చిరుతల దాడులు, నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం, భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కర్రలు ఇస్తామని టీటీడీ చెప్పడంపై సైతం సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.
టీటీడీ పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇందులో 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి ముగ్గురిని తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ సభ్యులంతా దేవాలయం యొక్క ఆధ్యాత్మిక పవిత్రత, ఆర్థిక పారదర్శకత.. సమర్థవంతమైన పనితీరును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు. కొద్దిరోజుల క్రితమే టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
ఎమ్మేల్యే కోటాలో పోన్నాడ సతీష్, సామినేని ఉదయభాను, తిప్పేస్వామికి అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజీత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు, యానదయ్య, కర్నూలు నుంచి సీతారామిరెడ్డి, గోదావరి జిల్లా నుంచి సుబ్బారాజు, సిద్దారాఘరావు కుమారుడు సుధీర్, అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్,కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండే కు అవకాశం కల్పించారు.
ఇద్దరి నియామకం వివాదాస్పదం
టీటీడీ పాలకమండలిలో పెనక శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ పేర్లు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పెనక శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడు. అలాగే 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా అక్రమాలకు పాల్పడిన గుజరాత్‌కు చెందిన యూరాలజిస్ట్ కేతన్ దేశాయ్‌కి బోర్డు సభ్యునిగా పదవి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
పురేంధేశ్వరి ఆగ్రహం
టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మరోసారి సీఎం జగన్ నిరూపించారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి విమర్శించారు. శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్‌ని బోర్డు సభ్యుల్లో స్థానం కల్పించడంపై మండిపడ్డారు. ఢిల్లీ మధ్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి పాత్రధారుడుగా ఉంటే, ఎంసీఐ స్కామ్‌లో కేతన్ దేశాయ్ దోషిగా ఉన్నారని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి పవిత్రత మసకబారేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు.
పాలక మండలి ప్రకటనపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన టీటీడీ బోర్డు సభ్యుల్లో చాలా మంది దేవుని సేవకు అర్హత లేనివాళ్లేనని మండిపడ్డారు. దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)లో ఆగ్రహం వ్యక్తం చేశారు.