Telangana News: హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో అధికారి లైంగిక వేధింపుల ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్‌ చేస్తామని చెప్పారు. అధికారి లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మహిళలపై వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సోషల్ మీడియా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. 






హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక దాడుల గురించి ఎమ్మెల్సీ కవిత  ట్విటర్ వేదికగా స్పందించారు.  కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కవిత కోరారు. 






అసలేం జరిగిందంటే?
హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఓ అధికారి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బాలికల హాస్టల్లోని గెస్ట్‌ రూంలోనే మకాం పెట్టాడు. విద్యార్థినులు, మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. బలవంతంగా  విద్యార్థులను బయటకు తీసుకువెళ్లేవాడు. అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను విద్యార్థినలు హాస్టల్‌కు వచ్చాక మహిళా ఉద్యోగులకు చెప్పుకొని భోరుమనే వారు. అంతే కాదు స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసలీలలు జరిపేవాడు. 


ఆయన ఆగడాలకు, మరో ఇద్దరు సీనియర్‌ కోచ్‌లు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజూ సదరు అధికారి కాళ్లు మొక్కాలంటూ విద్యార్థులను ఆ సీనియర్‌ కోచ్‌లు వేధిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం ఓ బాలిక ఒకరోజు కొన్ని గంటల పాటు పాఠశాల ప్రాంగణంలో కనిపించలేదు. ఆందోళన చెందిన అధికారులు పాఠశాల ప్రాంగణంలో వెతికారు. కాసేపటికి ఆ బాలిక.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గదికి ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గదిలో లోదుస్తుల్లో కనిపించడంతో నివ్వెరపోయారు.


సదరు మహిళా ఉద్యోగి వినియోగించే జడ పిన్నులు, హెయిర్‌ బ్యాండ్లు ఈ అధికారి గదిలో కనిపించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయం స్వీపర్ల ద్వారా బయటకు పొక్కుతుందని గమనించిన ఆయన, వారిని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది తన గురించే చర్చించుకుంటున్నారన్న అనుమానంతో మహిళా ఉద్యోగులనూ హెచ్చరించారని, వారిని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిసింది.


లైంగిక వేధింపుల గురించి బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారి భాగోతం గురించి అథారిటీకి చెందిన ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదు వెళ్లింది. అయితే అధికారికి మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటం, ఉద్యోగుల సంఘంలోనూ ఆయన కీలకంగా ఉండటంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు విషయం బయటకు పొక్కడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.