సినీ పరిశ్రమలో అగ్రనటిగా తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా గూగుల్ ఆమెకి ఘన నివాళి అర్పించింది. ఈ క్రమంలోనే శ్రీదేవి జయంతి సందర్భంగా డూడూల్ ద్వారా ఆమెను గౌరవించింది. శ్రీదేవి మరణించిన ఐదేళ్ల తర్వాత ఆమెకు ఇలాంటి గౌరవం దక్కడం పట్ల ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఈ డూడుల్ పిక్చర్ ను ముంబై కి చెందిన ప్రముఖ యానిమేటర్ డిజైనర్ భూమిక ముఖర్జీ రూపొందించారు. ఇక ఆగస్టు 13 1963లో తమిళనాడులో జన్మించిన శ్రీదేవి. కేవలం నాలుగేళ్ల వయసులోనే తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత తమిళ, తెలుగు, మలయాళ మరియు హిందీ సహా భారతదేశంలోనే అగ్రనటిగా ఓ వెలుగు వెలిగారు.
1976లో కే బాలచందర్ తెరకెక్కించిన 'ముండ్రు ముడిచు' అనే సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకుంది శ్రీదేవి. అలాగే 'గురు', 'శంకర్ లాల్' వంటి సినిమాల్లో తన నటనతో ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత 'పదహారేళ్ళ వయసు', 'కొండవీటి సింహం' మరియు 'వేటగాడు' వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇక అప్పటివరకు దక్షిణాది చలనచిత్రాలతో స్టార్ హీరోయిన్గా ముందుకు వెళ్తున్న శ్రీదేవి ఒక్కసారిగా బాలీవుడ్ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. దాంతో హిందీలో 'హిమ్మత్వాలా' సినిమా నుంచి 'సద్మా' మరియు 'చాల్ బాజ్' వరకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. మరో విశేషమేంటంటే అప్పటివరకు స్టార్ హీరోల డామినేషన్ ఎక్కువగా ఉన్న బాలీవుడ్లో ఇండస్ట్రీలో తన బ్లాక్ బస్టర్ సినిమాలతో అందర్నీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కి చేరింది.
ఇక ఆ తర్వాత సినిమాలకు కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. కొంత విరామం తర్వాత 2012లో మళ్ళీ 'ఇంగ్లీష్ ఇంగ్లీష్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అలా బాలీవుడ్లో అగ్రనటిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. నటిగా సినీ ఇండస్ట్రీకి ఆమె చేసిన కృషికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురష్కారం లభించింది. అలాగే 2017 లో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'మామ్' సినిమాలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. కాగా 2018లో ఆమె అకాల మరణం ఒక్కసారిగా చిత్ర పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినప్పటికీ ఆమె తరాల నటీ నటులతో పాటు సినీ ప్రముఖులు, ప్రేక్షకుకు ఆమెను ఎప్పటికీ స్మరిస్తూనే ఉంటారు.
ఇక ఈరోజు శ్రీదేవి 60 వ జయంతి సందర్భంగా మరోసారి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆమెను స్మరించుకుంటూ నివాళి తెలుపుతున్నారు. ప్రస్తుతం శ్రీదేవి సినీ వారసత్వాన్ని కూతురు జాహ్నవి కపూర్ ముందుకు నడిపిస్తూ బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చేయడానికి వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'భోళా శంకర్'లో పవన్ స్టెప్ చూసి ఉలిక్కిపడ్డాను : పరుచూరి గోపాలకృష్ణ