Minister Niranjan Reddy: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసమే ఆరాట పడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది బలవంతంగా బీజేపీ ప్రజల మీద రుద్దిన ఎన్నిక అని విమర్శించారు. రైతుబంధు పథకం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అని మర్రిగూడ మండలం కమ్మగూడ, దేవర భీమనపల్లిలో చేస్తున్న ఉప ఎన్నికల ప్రచారంలో తెలిపారు. అలాగే నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుండి విముక్తి కల్గించిందని చెప్పుకొచ్చారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లను ఇస్తున్నది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యేనని వివరించారు.


అన్ని జిల్లాల కంటే ముందుగా విషపు నీళ్ల నుంచి విముక్తి కల్గించాం..


సాగునీటి ప్రాజెక్టులు కట్టి, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగుచేసి నీళ్లతో నింపింది టీఆర్ఎస్  యే అని అన్నారు. ఇంతకన్నా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలు అమలు చేస్తున్నామని అని ఓట్లడుగుతారా అని ప్రశ్నించారు. విపక్షాలకు తమకు ఓట్లేయాలని అడిగేందుకు అంశాలు లేవన్నారు. ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజలే మాకు చెబుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకన్నా ముందు మునుగోడుకు తాగు నీరు ఇచ్చి విషపు నీళ్ల నుండి విముక్తి కలిగించినందుకు అయినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారన్నారు. సాగునీటిని అందించేందుకు శివన్నగూడెం, క్రిష్ణ రాయిని పల్లి, లక్ష్మణపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు మాకే ఉన్నాయని సింగిరెడ్డి నిరంజరన్ రెడ్డి అన్నారు.  


వాడివేడిగా సాగుతున్న మునుగోడు రాజకీయం


ప్రస్తుతం మునుగోడ ఉపఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో.. అందరి దృష్టి మునుగోడు పైనే ఉంది. బీజేపీ తమ పార్టీ చెందిన ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను మునుగోడుకు తీసుకువస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాముగా తయారు అయింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఒక్క చౌటుప్పల్ మండలానికి ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఎలాంటి ఘర్షణలు, దాడులు లేకుండా ప్రశాంతంగా సాగేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.