Sabitha Indra Reddy: కందుకూరులో శనివారం (సెప్టెంబర్ 23) మార్కెట్‌ సముదాయాన్ని మంత్రి సబితారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్‌‌లో తిరుగుతూ మహిళలందరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా అక్కడ కూరగాయలు విక్రయించే మహిళతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె గురించి ఆరా తీశారు. అంతే కాదు మంత్రి సబిత అక్కడే కూరగాయలు కొనుగోలు చేశారు. దీంతో మహిళా వ్యాపారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందంలో తూకం వేయడం మరపోయింది. ‘సబితమ్మ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేసింది. తమ కోసం ఇంత మంచి మార్కెట్‌ నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆ మహిళా వ్యాపారి భర్త వేరే రాజకీయ పార్టీకి చెందిన కార్మిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్నారు. 


పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కందుకూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. కందుకూరు, చిన్న రోడ్డు నుంచి ఫార్మాసిటీ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కందుకూరు, కొత్తగూడ గ్రామాలకు చెందిన నిరుపేదలకు 300 మందికి ఇంటి స్థలాల సర్టిఫికెట్లను జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల కాలంలో కందుకూరు, మహేశ్వరం, మండలాలతో పాటు నియోజకవర్గం పరిధిలోని అర్బన్‌ ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతోనే దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు సౌకర్యం కల్పించడానికి నిధులు మంజూరు చేశారన్నారు. 


ఓర్వలేకే విమర్శలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసమే పని చేస్తుందని మంత్రి సబిత అన్నారు. ఎక్కడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడడం లేదన్నారు. ప్రజాశ్రేయస్సుతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం వల్లే 300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామన్నారు. దాదాపు 8 ఎకరాల్లో పట్టాలు తయారు చేయించి ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమపై చూపుతున్న ఆదరణకు ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే మోసపూరిత  మాటలు చెబుతున్నాయని ఆమె అన్నారు. అనంతరం కుమ్మరి సంఘం ఏర్పాటు చేసిన కవయిత్రి మొల్ల విగ్రహాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ కవయిత్రి మొల్ల చేసిన సేవలు మరుపురానివన్నారు. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి మహిళ మొల్ల అన్నారు. 


అడుగడుగునా అభివృద్ధి
జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలనే చెప్పుకుంటున్నామన్నారు. తెలంగాణలో అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు, ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణ రూపురేఖలు మారాయని ఆమె అన్నారు.  అయినా, ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. అనంతరం సభలో ప్రసంగించిన ఎంపీపీ మంద జ్యోతి కార్యక్రమం బీఆర్‌ఎస్‌ సభలా ఉందని మధ్యలోనే వెల్లిపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు, అధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.