Minister Ponnam Prabakar Comments On RTC Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. కరీంనగర్ (Karimnagar) నుంచి 33 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన కరీంనగర్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వానిది ప్రజాపాలన అని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని.. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. 


విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని పొన్నం తెలిపారు. 'హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ  విద్యుత్ బస్సు సర్వీసులను నడపాలన్నదే ప్రభుత్వ ఆలోచన. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులతో ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.


ప్రయాణికులకు గుడ్ న్యూస్


అటు, విజయవాడ (Vijayawada) వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బీహెచ్ఎల్ డిపో నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు కొత్తగా 2 ఈ - గరుడ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని.. రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియా టౌన్ షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తాయని చెప్పారు. ప్రతి రోజూ రాత్రి 9:30, 10:30 గంటలకు రామచంద్రాపురం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: Airport Metro Alignment: ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మార్పు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం