కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జల విహార్ లో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'ఓ బక్క పలుచని కేసీఆర్ ను ఢీకొట్టేందుకు చాలా మంది ఒక్కటవుతున్నారు. కేసీఆర్ ను ఓడించడమే తన జీవిత లక్ష్యమని షర్మిల ప్రకటించారు. ఒకటి మాత్రం పక్కాగా చెప్తా. 2014లో ఎవరినీ నమ్ముకోలేదు. ప్రజలనే నమ్ముకున్నాం. 2018లోనూ ప్రజలనే నమ్ముకున్నాం. 2023లోనూ ప్రజలనే నమ్ముకుంటాం. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముతాం. మిమ్మల్ని నమ్ముతాం.' అని పేర్కొన్నారు.
న్యాయవాదులపై ప్రశంసలు
న్యాయవాదులతో ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మంత్రి కేటీఆర్ వారితో ముచ్చటించారు. అడ్వొకేట్ ట్రస్ట్ రూ.500 కోట్లకు పెంచుతామని, న్యాయవాదులకు వైద్య బీమా కూడా పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో న్యాయవాదుల సేవలను కొనియాడారు. విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు పోరాడారని ప్రశంసించారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమమే తమకు విజయం దక్కేలా చేస్తుందని అన్నారు. 'న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, కరోనా సమయంలో కాపాడిన వ్యక్తి, 250 మంది అడ్వకేట్లకు సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్ ఎవరి మీదనో ఎందుకు ఆధార పడాలి. కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది.' అని కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో ఒక్క పైసా ఆశించకుండా తమకు అండగా నిలబడ్డ న్యాయవాదులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
'అభివృద్ధి వారికి కనిపించట్లేదు'
'హైదరాబాద్ లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్ అన్నారు. ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయాలని అనిపిస్తోందని ఓ బీజేపీ నేత అన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది కానీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదు. కేసీఆర్ మళ్లీ గెలవకుంటే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. కేసీఆర్ ను ఓడించేందుకు అంతా ఏకమవుతున్నారు. తెలంగాణ సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించాలి. మోదీ, రాహుల్ కాదు. ఈ ఎన్నికల పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోంది.' అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉందని, రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరాయని, 24 వేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని వివరించారు. 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చి, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు.
'సింహం సింగిల్ గానే వస్తుంది'
సీఎం కేసీఆర్ సింహం లాంటి వారని, సింగిల్ గానే వస్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాం కాబట్టే స్వేచ్ఛగా ఓట్లు అడగ గలుగుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదని, గతంలో నెహ్రూ, ఇందిరతోనూ కొట్లాడారని, ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో సీఎంలు దొరికారని, కానీ ఓటర్లే దొరకలేదని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కరెంట్ సమస్యను పరిష్కరించలేక పోయిందని, పదవులు తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. పాలన మారితే మొత్తం గందరగోళం అవుతుందని, కొత్త వాళ్లకు అర్థమయ్యే సరికి ఉన్న కాలం గడిచిపోతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్లు వస్తేనే మళ్లీ అభివృద్ధి బాగుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం- మీమ్స్, రీల్స్, వీడియోలతో నేతల హడావుడి