Minister KTR: ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ధర్మపురి పేరులోనే ధర్మం ఉందని.. ఓటులోనూ ధర్మం ఉండాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని, అప్పుడే ధర్మం ఉన్నట్లు లెక్క అన్నారు. చల్లటి మనిషి, సౌమ్యుడు, మృదుస్వభావి కొప్పుల అని అన్నారు.
కొప్పల రాజకీయ ప్రస్థానం గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈశ్వరన్న లాంటి సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం, ఇంత ఉన్నత స్థానానికి రావడం మామూలు విషయం కాదు. తన కేరీర్ చూస్తే 1976, నవంబర్‌లో 17 ఏండ్ల వయసులో సింగరేణిలో పని చేయడం ప్రారంభించారు. దాదాపు 26 ఏండ్లు సింగరేణిలో పని చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి, కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి.. 22 ఏండ్ల కిందట కేసీఆర్‌తో తమ్ముడిలా అటాచ్ అయిన తర్వాత.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఎత్తులు పల్లాలు చూశారు. గెలిచినా, ఓడినా కేసీఆర్‌కు ఒక తమ్ముడిలా, నిబద్ధత కలిగిన సైనికుడిలా కలిసిమెలిసి ఉన్నారు’ అని కేటీఆర్ కొనియాడారు.
‘కేటీఆర్, హరీష్ రావు వెళ్లినా నేను ఉంటా అన్నడు’
తాను కొప్పుల ఈశ్వర్‌కు ఫ్యాన్ అయిపోయాను అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లో గెలిచామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఒకటే టీవీలు, పేపర్లలో ఒకటే స్టేట్‌మెంట్లు అని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పోతున్నారంటూ ప్రచారం చేశారని, తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ కొప్పుల ఈశ్వర్ మాత్రం పార్టీ మారలేదని, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. కేసీఆర్‌తో ఇవాళ ఉన్నానని, రేపు ఉంటానని, చచ్చేదాకా ఉంటానని కొప్పుల చెప్పారని అన్నారు. ఒక వేళ ఏదైనా పరిస్థితుల్లో కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ విడిచిపెట్టి పోయినా నేను మాత్రం కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
‘చెరువు నిండిన తరువాత కప్పలు మస్త్ వస్తయ్’
మనం కష్టంలోనే ఉన్నప్పుడు మనోడు ఎవడో.. మందోడు ఎవడో తెలుస్తందని కేటీఆర్ అన్నారు. చెరువు నిండిన తర్వాత కప్పలు మస్తు వస్తాయన్నారు. గర్వంగా చెబుతున్నానని.. ఈశ్వరన్న లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఆయనతోటి ఒక్క పంచాయితీ ఉండదని. ఎవరితోనూ కొట్లాట ఉండదని, నవ్వుతూ మాట్లాడతారని అన్నారు. పద్ధతిగా, వినయంగా, మర్యాదగా అందరిని దగ్గరికి తీసుకొనే వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ధర్మపురి అభివృద్ధికి కొప్పుల నిర్విరామంగా పని చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ధర్మపురిని మున్సిపాలిటీ కూడా చేసుకున్నామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 13 రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ. వందల కోట్లతో నిర్మాణం జరిగిందని, 40 వేల ఎకరాలు ఉన్న ఆయకట్టును లక్షా 26 వేల ఎకరాలకు ఆయకట్టు తీసుకెళ్లారని అన్నారు. వెలగటూరులో వ్యవసాయ కాలేజీ రాబోతోందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఈశ్వరన్నను చీఫ్ విప్‌గా కేబినెట్ ర్యాంకులో పెట్టుకున్నారని, రెండో టర్మ్‌లో కేబినెట్ మంత్రిగా తీసుకున్నారని అన్నారు.